- అంకితమైన ఆసాదులు:
ప్రత్యేకించి ఈ గరగ నృత్యాన్ని వృత్తిగా స్వీకరించి, అందుకే అంకితమైన వారిని ఆసాదులంటారు. పల్లెల ద్వారా ప్రచారం పొందిన నృత్యాలకు జానపద నృత్యాలని పిలవబడటం మూలాన ఈ గరగ నృత్యాలను కూడ జానపద కళలలో ఒక కళగా భావించ వచ్చు. ఈ కళకు అంకిత మైన ఈ ఆసాదు లనబడే వారు కూడా వృత్తి కళాకారులకు చెందిన వారై యున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో వీరి సంఖ్య దాదాపు అయిదు వందలు. ఈ జిల్లాలలో గరగ నృత్యాల ప్రాముఖ్యతను సంతరించుకున్న కొన్ని గ్రామాల్లోవున్న గ్రామదేవతలు "పెద్దాపౌరం మరిడమ్మ","కాండ్రికోన నూకాలమ్మ","రాజమండ్రి సోములమ్మ","రాజానగరం ముత్యాలమ్మ", "ఠాణేలంక బులుసమ్మా", "గోకవరం గుబ్బాలమ్మ", "మారేడుమల్లి గంగాలమ్మ", "బమ్మంగి పేరంటాలమ్మా", "మల్లిపాల శిగరమ్మ", "దేవీపటం గడి పోచమ్మ", "తుని తలుపలమ్మ", "కొత్తపల్లి నూకాలమ్మ" ప్రసిద్ధం.
- కోనసీమ గరగలు:
అమాలపురం తాలూకా కోన సీమ ప్రాంతంలో ఈ మాదిరి దేవతలు గరగ నృత్యాల ప్రాముఖ్యంతో వున్న గ్రామాలు దాదాపు 35 వరకూ వున్నాయి. ఒరిస్సాకు చెందిన రాయగడ మధ్య గవరమ్మ వుత్సవంలో కూడ ఈ గరగ నృత్య ప్రాముఖ్యాత వుంది. అగ్ని గుండాలను తొక్కడం ద్వారాఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలలో, మరింకెన్నో గ్రామాలలో ఈ గరగ నృత్యాలు ప్రసిద్ధి చెందాయని పెంజర్ల వేంకటేశ్వర రావు గారు వివరిస్తున్నారు.
గ్రామదేవతలను నమ్ముకుని, అమ్మవారికి అంకితమై, గరగ నృత్యమే జీవనాథారంగా పేర్కొన బడిన ఆసాదులు వృత్తి కళాకారులనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
- గరిక ముంతలే గరగలు:
ఆంధ్రదేశంలోనూ, రాయలసీమ లోనూ, తెలంగాణాలోనూ, కర్నాటక లోనూ కరగ అనే పేరుతోనూ తమిళంలో కరగం అనే పేరు తోనూ, ఇతర ఆంధ్ర ప్రాంత గరికె, గరిక, గరిగ,గరిగె అనే పేర్లు తోనూ ప్రచారంలో వుంది.