పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/336

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ మాదిరి కథ వినిపించింది జక్కుల పురంధ్రి అని విదితమౌతోంది. దీనిని బట్టి మూల యక్షగానం సంగీత నృత్య సహాయంతో కథ వినిపించే కళారూపమని స్పష్టమౌతోంది.

ధర్మాంగద చరిత్ర, చిత్రాంగద విలాసం మొదలైన యక్షగానాలు 'వేషముల్ గట్టి జనులు పాడి వినిపింప' అనడాన్ని బట్టి 'వలుపు బాడుచు వచ్చె జక్కుల పురంధ్రి' అనేదాన్ని బట్టి గోవింద దీక్షితుడు సంగీత సుధ అనే లక్షణ గ్రంథంలో యక్షగానం యక్షులచేత పాడబడే ఒక సంగీత విశేషమని వుదాహరించడాన్ని బట్టి పాడి వినిపించడానికీ వుపయోగింప బడ్డాయని అర్థమౌతూంది. అతి ప్రాచీన యక్షగానాలైన ఓబయ మంత్రి గరుడాచల యక్షగానమూ, కందూకూరి రుద్రయ్య రచించిన సుగ్రీవ విజయమూ పాడి వినిపించినవేగాని యక్షగానాలుగా ప్రదర్శింప బడినవి కావు. కేవలం ఒకే నటి వివిధ పాత్రల్ని అభినయించేదని ఉదాహరణలను బట్టి తెలుస్తూవుంది. అయ్యగారి వీరకవి రచించిన చిత్రాంగద విలాసమనే యక్షగానంలో

చిత్రాంగద విలాసమనగ యక్షగాన మొనరించు.
వేషముల్ గట్టి జనులు పాడి వినిపింప.

అని పేర్కొనడాన్ని బట్టి యక్షగాన రూపంలో వున్న వీథి నాటకమని బోధ పడుతూంది. పై వుదాహరణలను బట్టి యక్షగానాలు, వీధి నాటకాలు, బుర్రకథలు మొదలైనవన్నీ దేశి సారస్వతానికి చెందిన సంగీతరూపకాలుగా పరిణామం చెందుతూ, దేనికి దానికే ఒక ప్రత్యేకమైన రూపాన్ని సంతరించుకుని, వివిధ కళారూపాలుగా వృద్ధి చెంది వుండవచ్చు. ఇలా గాన రూపంగా అభివృద్ధి పొందుతూ వచ్చిన యక్షగానంలో సూత్ర ధారుడు ప్రవేశించి, నటి యొక్క పాటకు వంత పాడుతూ, కథా గమనంలో వచ్చే చిల్లర పాత్రలకు వాచికం చెపుతూ వుండేవాడు. నటి వివిధ పాత్రల్ని అభినయిస్తూ కథ వినిపించేది. ఈ విధానమే భామాకలాపం, గొల్లకలాపంగా రూపొంది వుండవచ్చు. సూత్ర ధారుడు విదూషకుడుగా మారి వుండవచ్చు.

తరువాత యక్షగానంలో వచ్చిన మార్పులననుసరించి మరో దశ నందుకుంది. ఒకే నటుడు వివిధ రకాల పాత్రల్ని అభినయించడమే కాకుండా విడి విడిగా ఒక్కొక్కరూ ఒక్కొక్క పాత్రను అభినయించే సాంప్రదాయం ఏర్పడింది. తంజావూరు యక్షగానాల్లోనూ, యాదవ దాసు గరుడాచల యక్షగానంలోనూ, పాత్రల