- అమ్మాయిల్ని చూసి ఆడమంటాడు:
నృత్యం చేసే అమ్మాయిల్ని చూసి ఆనందపడిపోయి ఆడమంటాడు. అప్పుడు అమ్మాయిలు వివిధ నాట్యరీతుల్ని, శాస్త్ర విషయాలనూ, శ్లోకాల ద్వారా వల్లించి వాటి అర్థం వివరించి తల పండిన పండితులు కూడ తలలూపే విధంగా మెప్పిస్తారు. ముఖ్యంగా బాల గోపాల తరంగం, దశావతారాలు వంటి రూపాలను నడివీథిలోనే ముద్రలుపట్టి అభినయిస్తారు. అంటే శాస్త్రీయ రూపాలైన వీటిని సామాన్య జనానికి అందుబాటులో ప్రదర్శిస్తారన్నమాట.
అందంగా, సుందరంగా అభినయించిన నాట్య కత్తెల అభినయం చూసి, సిద్దీ ఏమీ ఇవ్వక పోగా చివరికి నవాబు దర్శనానికి అంగీకరించడు.
అందుకు జవాబుగా వళ్ళు మండిన భాగవతుడు, తుమ్మిచెట్టు తినేపళ్ళు కాయదు. పైగా పళ్ళచెట్టు ఎవ్వరూ ఎక్కకుండా ఈ తుమ్మకంచె కాపలా అంటూ, అలాంటి తుమ్మచెట్టు లాంటి వాడవు అని తిట్టడంతో, ఈ ఉపమానాన్ని సాహిత్య ప్రియులు కూడ మెచ్చుకుంటారు.
ముఖ్యంగా నాటి భాగవతుల ప్రావీణ్యాన్ని ప్రకటించే అవకాశం వున్న కళారూపమది. శృంగార, హాస్య రసాలకు పట్టు కొమ్మ అంటారు. (పడాల రామకృష్ణా రెడ్డి గారు, విశాలాంధ్ర వ్వాసంలో)
- గంగిరెద్దు:
డూడూ బసవన్నా, దొడ్డ దొరండీ బసవన్న
అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు
కోటి లాభములు కలగాలండి, కోట వేల్పుల దయ గలగాలి
డూడూ వెంకన్నా - తిరుపతి కొండకు ప్రయాణముండి, కుండీ
దేముని మొక్కులు తీర్చాలండీ బంగరు గిత్తల బసవన్నండీ
పయిడి కొమ్ముల బసవన్నండీ పాలమెరుగుల బసవన్నండీ
భాగ్యము లిచ్చే బసవన్నండీ - వెండి కొండపై విహారమండీ
విశ్వనాథునీ వాహనమండీ, పప్పు బియ్యం పట్టుకు రండీ
పట్టు వస్త్రముల బట్టుకురండీ - బసవన్ దయ సంపాదించండీ
డూ, డూ, బసవన్న.