భోంఛేసేవాళమే. ఇంతెందుకు గుమ్మడి కాయంత బంగారం కుక్క మూచ్చూసిందని, దిబ్బలో వెయ్యడానికి, మైల బడతాయని ముగ్గురు కూలీలకి మూడు దమ్మిడీల కూలిచ్చి, వూరవతల కోనేట్లో పారేయించాం. ఈ సంగతి తెలిసి పక్కింటి పరమేశం భార్య దాన్ని తెచ్చుకుని, కాళ్ళ కడ్డదిడ్డాలు, నడుముకు నానా తిప్పలు, ముక్కుకు ముంగిర, చెంపకు చెంప సెరాలు. నెత్తికి మూకుడు చిప్ప చేయించు కున్నది. మాకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇంట్లో పంపు, వీధిలోపంపు, పొయ్యి గడ్డమీద పంపు, పొయ్యిలో పంపు, అన్నీ వున్న పొయ్యి మీదికి, పై వంట మీదికి రెండు మాత్రమె తక్కువై వచ్చాం.
ఔను మొన్న మా నాయనమ్మ పెండ్లికి విమాన బంపితే రాలేదేమండీ. వూళ్ళొ వుండే ముండ మోపులంతా వచ్చారే. పెళ్ళికి చాటెడు బియ్యం చెరువులో బోసి తూముకు మందు పెట్టి ఆ బియ్యం కళా పెళా వుడుకు తుంటే, చెలకపొరల తోడి తిరిగేయించాం, కూరలేమి చేయించామంటే విచిత్రం పచ్చి పులుసు, ఇటుకరాయి ఇగురు, పలుగురాయి పచ్చడి, లోయలో తోటాకు, వేపాకు కూర, ఈగల తాలింపు, నల్లుల తిరగమోత, వంకాయ వరుగేసి, గుమ్మడి కాయ గుడించి, ముగ్గురికి ఒక, మెతుకు, నలుగురికి ఒక బద్ద... వచ్చిన వాళ్ళకు వాత, రాని వాళ్ళకు గీత వడ్డించాం. అదీ చాలక పోతే., ఒకరి మూతి ఒకర్ని నాక్కోమన్నాం.
పెళ్ళికి వచ్చిన పేరంటాళ్ళు కాటుక లేదన్నారండీ ఆక్షేపణ పడలేక చాటెడు మిరపకాయలు, కళా పెళా వేయించి, ఇద్దరు కూలీలతో మెత్తగా పొడి గొట్టించి, రెప్ప తప్పించి గుడ్లకతికించాం. అంతె చిర్రున చీది, చర్రున గోడకతుక్కున్నారు. తమల పాకులు లేవండీ, అంటే వెంటనే మునిసిపాలిటీ వాళ్ళకు కబురు పెట్టి, దిబ్బమీది ఇస్తరాకులు తెప్పించాం. ఇలా ఏమీ ఇబ్బంది లేకుండా పెళ్ళి జరిపించాం. మీరు రాకపోవట మొక్కటే లోటు.
నేనూ మా అవిడ మొన్న జరిగిన కృష్ణా పుష్కరాలకు వెళ్ళామండీ. అవిడ స్నానం చెయ్య బోయి, నీళ్ళలో మునిగి పోతుంటే, కొప్పు అయితే చేతి కొచ్చింది కానీ ఆమె రాలేదు. ఆరోజు నుంచి, ఈ రోజు వరకు కుండెడు అన్నం ముందు బెట్టుకుంటే లోపలికి పొయ్యే ముద్దేగాని బయటికి వచ్చే మెతుకే లేదంటే నమ్మండీ.