పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేనాని అనే రెడ్డి సామంతుడు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్రకళా కౌశలం శిల్పనైపుణ్యం వర్ణించ నలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా ఈ నాటికీ చూపరులకు ఆనందాన్ని కలిగిస్తూ వుంది. భరత నాట్యమంతా మూర్తీ భవించి స్థంభాల మీదా, కప్పుల మీదా కనబడుతూ వుంది.

జాయప సేనాని:

కాకతి గణపది దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయం శక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే కాక కళాకారుడు కూడా.

జాయపకు నృత్యాలంటే అత్యంతాభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ నృత్తరత్నావళి భారతీయ నృత్య కళా సంపదకు, ఆభరణం లాంటిదని నృత్య శాస్త్రవేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రులు రచించిన ప్రపథమ నృత్య శాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు తెలియజేశారు.

గణపతిదేవ చక్రవర్తి జాయప యందు అత్యంత ఆదరాభిమానాలతో అతనికి సకల విద్యల్నీ, కళలనూ నేర్పించాడు. ఆ తరువాతనే జాయన అత్యుత్తమైన, అత్యున్నతమైన నృత్తరత్నావళి రచనకు పూనుకున్నాడు. దానిని క్రీ॥శ॥ 1253 - 54 ప్రాంతాల్లో పూర్తి చేశాడు.

మేటి నాట్య గ్రంథం:

నృల్త్తరత్నావళిలో మార్గ దేసి నృత్యాలు, రెండు కలిసినట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆధ్యాయాలున్నాయి.

జాయప నృత్త రత్నావళిలో తన కాలంలో ప్రచారంలో వున్న దేశి నృత్యాలన్నిటినీ అమూలాగ్రంగా చిత్రించాడు. ఎనిమిది ఆధ్యాయాలు గల ఈ గ్రంథంలో చిట్టచివరి మూడు ఆధ్యాయాలూ, దేశి నృత్య సంప్రదాయాలైన, పేరణి ప్రేంఖణం, రాసకం, చర్చరి, నాట్యరాసకం, దండ రాసకం, శివప్రియం, చిందు, కందుకం, భాండికం, ఘంటసరి, చరణము, బహురూపము, కోలాటం మొదలైన అనేక జానపద నృత్యాలను వివరించాడు.