పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిజన నాగన్న - చెంచు లక్ష్మి, మాల నాగప్ప - సింగి, కుమ్మరి నారాయణ, సింగడు - కుమ్మరి నారాయణస్వామి మొదలైన వారు. అనంతపురం జిల్లా - ధర్మవరం తాలూకా, సుబ్బరావు పేట గ్రామంలో వున్నారు.

జంఖండీ వీథి నాటకం

మహారాష్ట్రం నుండి ఆంధ్రదేశం వచ్చిన సురభి కళాకారులు, తొలి రోజుల్లో ఈత మట్టల బొమ్మలాటల్నీ, జంఖండీ నాటక ప్రదర్శనాలను ప్రదర్శించారు.

ఖండే అనే ఆయన మహారాష్ట్ర కళాకారుడు. ఈ నాటక రూపాన్ని ప్రారంభించడం వల్ల ఈ నాటకానికి జంఖండీ నాటకమని పేరు వచ్చింది. ఏ రామాయణాన్నో, భారతాన్నో ప్రదర్శించా లనుకున్నప్పుడు, కావలసిన పాత్రధారులందర్నీ కొద్ది కొద్ది వేష ధారణ మార్పులతో రంగస్థలం మీద కూర్చో బెట్టి, రామాయణాన్ని భాగాలు భాగాలుగా ప్రదర్శించేవారు. రంగస్థలం మీద కూర్చున్న ఏ పాత్ర మాట్లాడదు.

ఖండే గారు రాముని పాత్ర దగ్గరకొచ్చి శ్రీరామ చంద్రుల వారు, ఏమంటున్నారండీ అని రాముని సంభాషణలు తానే పలికి అన్నగారైన రామచంద్రుల వారి మాటకు తమ్ముడు లక్ష్మణ స్వామి ఏమి బదులు చెపుతున్నాడంటే, అంటూ వివిధ పాత్రలకు ఆయనే సంభాషణలనూ, శ్లోకాలనూ, పాటలనూ వల్లించే వాడు. మధ్య మధ్య విసుగు లేకుండా అనేక సామెతలూ, గమ్మత్తులూ, ప్రజల అలవాట్లు, నీతులూ చెప్పి రంజింప చేసేవారు. ఖండే గారు మంచి మాటకారి, బహుముఖ ప్రజ్ఞా వంతుడు. ఎప్పుడైతే ఆంధ్ర దేశంలో బ్రతకాల్సి వచ్చిందో దాని ప్రాముఖ్యాన్ని గుర్తించి, తెలుగు నేర్చుకుని తెలుగు వారిని ముగ్దులను చేశాడు.

జంఖండీ నాటక ప్రదర్శనంలో రెండు రకాల వాయిద్యాలుండేవి. ఒకటి తోలుతో చేయబడ్డ శ్రుతి బూర, రెండవది ఒక పెద్ద పళ్ళెంమీద ఒక పుల్లను సారించడం ద్వారా ఒక శ్రావ్యమైన ద్వనిని తెప్పించేవారు. ఈ ధ్వని ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఈ నాటకానికి తెర లేదు. స్త్రీ పాత్రలు కూడా పురుషులే. ముఖాలంకరణకు అరదళం, మసిబొగ్గు, మీసాలకు గడ్డాలకు జనప నార ఉపయోగించేవారు. ఇలా ఖండేగారి వీథి నాటకాలు కొంత కాలం నడిచాయి.