పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిగబడిన లీలావతి ప్రాత్రధారి మంచంలో పరుండినట్లే ప్రేక్షకులకు భ్రాంతి కలిగించేది. భూమిమీద ఆనకుండా మంచం దానంతట అదే మధ్య అంతరంలో నిలబడినట్లు కనబడేది. కాళ్ళకు గజ్జెలు కట్టి లీలావతి పాత్రధారి పాట ప్రారంభించి నృత్యం చేస్తూ వుంటే పరుండిన వ్వక్తి పరుండి నట్లుగానే ఉన్నప్పుడు మంచం ఎలా నృత్యం చెయ్య గలుగుతున్నదా అని ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించేది.

ఈ ప్రదర్శనం మూడు గంటల కాలం జరిగేది. మంచం బరువుతో మూడు గంటల కాలం ఒకే పాత్రధారి విసుగు జనించ కుండా పాడుతూ, అభినయిస్తూ నృత్యం చేస్తూ ప్రేక్షకులను ఆనందింప జేసేవాడు. ఈ ప్రదర్శన ఇవ్వడంలో కూచిపూడి భాగవతులు సిద్ధ హస్తులు. వీరిలో నైనా అందరూ దీనిని ప్రదర్శించ గలిగేవారు కారు. దాదినమ్మ వేషం వెయ్యడంలో పూర్వం నాట్యకళానిధి వేదాంతం లక్ష్మీ నారాయణశాస్త్రి, వెంపటి వెంకటనారాయణ గార్లు సుప్రసిద్ధులు. వీరి తరువాత చెప్పుకోదగిన వారు చింతా రామమూర్తి, భాగవతుల రాజయ్య, వేదాంతం జగన్నాథశర్మ మొదలైనవారు.

వీథి భాగవతానికి వలెనే గ్రామంలో నాలుగు వీథుల నడుమ రచ్చబండ వద్ద వేసిన పందిరిలో ప్రదర్శనం, తెర, కాగడాలూ, వంతపాట గాండ్రూ, హాస్యా గాడూ మొదలైన హంగులతో, ఇరువైపులా జోడించి పట్టిన కాగడాలమీద చల్లిన గుగ్గిలం భగ్గు మనడంతో తెర తొలిగి పోయేది. తరువాత వెంటనే దాదినమ్మ పాత్ర ప్రవేశమై భాగవతం ఆరంబమయ్యేది. ఈ నాడు ఈ ప్రదర్శనం మచ్చుకు కూడ కనబడకుండా పోయింది. ప్రదర్శించే సమర్థులూ ఎవరూ లేరు. ఇది ఏకాపాత్రాభినయం లాంటిది.

ఆభరణాలూ, అలంకారాలూ:

కూచిపూడి భాగవతులు వారు ప్రదర్శించే ప్రదర్శనాలలో ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన వేషధారణను, ప్రాచీన సంప్రదాయలతో కూడుకున్న ఆభరణాలను ప్రవేశపెట్టారు. నాయిక, నాయకుడు, విదూషకుడు, చెలికత్తె, వుపనాయకులు మొదలైన అనేక పాత్రలు వారి వారి తారతమ్యంతో కూడుకున్న శరీరాలంకరణాలను, కంఠాభరణాల్ని, శిరోభూషణాలను ధరించేవారు.