Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
కుచేలపురం అంటే:

కూచిపూడి గ్రామం కృష్ణా జిల్లాలో మచిలీపట్టణానికి పదిహేను మైళ్ళ దూరంలో, శాతవాహన చక్రవర్తుల ముఖ్య పట్టణమైన శ్రీకాకుళానికి చేరువలో వుంది. మువ్వ గోపాల పదాలతో దక్షిణ దేశాన్నంతా ఉఱ్ఱూత లూగించిన క్షేత్రయ్య స్వగ్రామ మని చెప్పబడే మువ్వ గ్రామానికి అతి సమీపంలోనె వుంది. ఈ కూచిపూడి కళాక్షేత్రం, ఒక బ్రాహ్మణ అగ్రహారం దీనిని కుచేల పురమని కూడ కొంతకాలం క్రితం వరకూ పిలుస్తూ వుండేవారని ప్రతీతి. దాదాపు అయుదు వందల సంవత్సరాల పూర్వమే ఇక్కడ నాట్య కళకు అంకురార్పణ చేశారని చరిత్ర కారుల వల్ల తెలుస్తూ వుంది.

సిద్డేంద్రయోగి సుద్దులు:

అసలు కూచిపూడికి ఈ సంప్రదాయం ఎలా వచ్చిందో కొంచెం తెలుసుకుని ముందుకు నడిస్తే మనకు చరిత్ర బోధపడుతుంది. ఈ నాటికీ కూచిపూడి వారిని, మీకీ నాట్య సంప్రదాయం గానీ, భాగవత సంప్రాదాయం గాని ఎక్కడ నుండి వచ్చిందీ అని ప్రశ్నిస్తే వారు ఈ క్రింది గాథను తెలియజేస్తారు. కూచిపూడి భాగవతుల ప్రదర్శనానికి మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి అని చెప్పుతారు. ఈయన కూచిపూడి గ్రామస్తుడే అని కొందరు , యాత్రలు చేస్తూ కూచిపూడి చేరిన పరదేశి అని కొందరు ఆయన కాపుర స్థలాన్నీ కాలాన్నీ నిర్ణయించలేకుండా వున్నారు.

గురువును మించిన శిష్యుడు:

కొన్ని శతాబ్దాల క్రింద కూచిపూడి గ్రామంలో సిద్దయ్య అనే ఒకాయన వుండేవారట. ఆ సిద్దయ్యగారు చాల అమాయకుడు. నిరక్షరాస్యుడు. సోమరితనంగా తిరుగుతూ వుండేవాడు. ఆ వూరి తక్కిన బాలురచే పరిహసింప బడుతూ, ఏ మాత్రం విద్యాసక్తి లేక అయోమయంగా వుండేవాడట.