పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం


కూచిపూడి భాగవతుల పేరు వినని వారుండరు. ఆంధ్రదేశంలో ప్రతి మారుమూల గ్రామంలోనూ, వారి ప్రదర్శనాలు ప్రదర్శింపబడ్డాయి. పెద్ద పెద్ద రాజాస్థానాలలోనూ, దేవుళ్ళ కళ్యాణ ఉత్సవ సమయాల లోనూ, తిరునాళ్ళ సమయం లోనూ, కూచిపూడి భాగవతుల ప్రదర్శనాలు తప్పని సరిగా వుండేవి. ఆ విధంగా వారు కొన్ని శతాబ్దాల బట్టి ఏక ఛత్రాధిపత్యంగా విశాలాంధ్రలో విశేషంగా ప్రదర్శనాలిచ్చి వేనోళ్ళ వినతులు గొన్నారు.

వీరు ఆట ప్రారంభించారంటే భరతముని ప్రాసాదించిన భరతనాట్యాన్నీ, నంది కేశ్వరుని అభినయ దర్పాణాన్ని శాస్త్రయుక్తంగా తెల్లవార్లూ ప్రదర్శిస్తూ వుండే వారు. వేలాది ప్రజలు, వీరి ప్రదర్శనాలు చూసి ఉప్పొంగి పోయేవారు. ప్రదర్శనమంతా, ఆధ్యాత్మిక వాతారవణంతో నిండి వున్నప్పటికీ, ప్రజల చిత్త ప్రవృత్తులు కూడ ఆధ్యాత్మిక చింతనతో వుండడం వల్ల ప్రదర్శనంలో వచ్చే ప్రతి విషయమూ, అర్థమైనట్లు గానే వారు ఆహ్లాదంలో మునిగి ఆనందించేవారు. ఎంతో మంది పండితులు సైతం వీరి విద్యను పరీక్షించటానికి పోటీలు పడి మరీ కూర్చునేవారు.