పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/219

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వచ్చి ముందు వరుసలో కూర్చునేవారు. పెద్దలందరూ వస్తే గాని ప్రదర్శనం ప్రారంభమయ్యేది కాదు. వచ్చిన వారందర్నీ వారికి సహాయాలు చేసిన వారినీ ఈ విధంగా సంబోధించేవారు. ఈ సభా రంగమునకు అందరూ వచ్చియున్నారటరా? చిత్తం, కరణంగారు, చిత్తం, మున్సిఫ్ గారు, చిత్తం, పెద్దలందరూ వచ్చియున్నారటరా, చిత్తం సెహభాష్, వారందరికీ ఉచితాసనాలను అలంకరింప చేసి యుంటివా? చిత్తం ఈ విధంగా ప్రేక్షకులందర్నీ ఆకర్షించి, ప్రదర్శన ప్రారంభించేవారు. ప్రతి జట్టులోనూ సమర్థులైన ఇద్దరు ముగ్గురు హాస్య నటులుండేవారు. వీరు ఏ పాత్ర బడితే ఆ పాత్రను అచ్చు గుద్దినట్లు చెప్పేవారు. వేష ధారణలో ఈ నాటికీ కేకులు గానీ, పౌడర్లు గానీ, బ్రష్ లు గానీ లేవు. ముఖాలంకరణకు అర్దళం, మణిశిల, బొగ్గుపొడి, సింధూరం ఉపయోగించే వారు. క్రీప్ హెయర్ కు బదులు నార పీచు ఉపయోగించేవారు.

ప్రేక్షకుల్నీ ఇలా ఆకర్షించేవారు:
TeluguVariJanapadaKalarupalu.djvu

పొరదర్శనంలో ప్రతి పాత్రా రంగ స్థలంలో మూడు ప్రక్కలకూ తిరిగి అభినయించేవారు. దూరంగా వున్న వారికి వినబడేందుకు సూత్రధారులు హెచ్చు స్థాయిలో పాడేవారు. ప్రతి చరణాన్ని ఒక సారికి రెండు సార్లు రెట్టించి పాడే వారు. ఇలా రెట్టించడం వల్ల, అందరికీ ఇట్టే అర్థమయ్యేది. ఈ ప్రదర్శనంలో సాత్విక భావాలు దగ్గరగా వున్న వారికి తప్పా, దూరాన వున్నవారికి కనిపించేవి కావు.. అందువల్ల కాళ్ళతో నృత్యం చేసే వారు, నోటితో పాట పాడేవారు, చేతులతో భావానికి తగినట్లు అంగ చలనాన్ని ప్రదర్శించేవారు, మధ్య మధ్య శ్లోకాలను చదివే వారు. ఈ శ్లోకాలు చాలమందికి అర్థం కావని హాస్యగాని ద్వారా వివర మడిగించి, శ్లోకార్థాన్ని విశదపరిచేవారు. ప్రదర్శనంలో ఏ మాత్రం విసుగు జనించకుండా, హాస్య పాత్ర ధారులైన మాధవి, చోపుదారు, ద్వారపాలకుల ద్వారా చిత్ర విచిత్రమైన లోక ధర్మాలను, సాంఘిక ఆచారాలనూ ప్రవేశపెట్టి మధ్య మధ్య కడుపుబ్బ నవ్వు పుట్టించేవారు. ప్రదర్శనం పది గంటలకు ప్రారంభిస్తే, తెల్లవారి ఆరు గంటల వరకూ ప్రదర్శనాన్ని సాగించేవారు. ప్రేక్షకులు తెల్లవార్లూ, రెప్ప వాల్చకుండా ఈ ప్రదర్శనాలను చూసి ఆనందించేవారు.