పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైన వివరించిన ఈ చోడిగాని కలాపం రాత్రి తెల్లవార్లూ ప్రదర్శిస్తారు. కథా వస్తువు దంపతుల కయ్యానికి సంబందించింది. దీనిలో శృంగారం రసా భాసమైనది. కురవంజిలో సింగీ సింగని వాగ్వివాద లక్షణాలు, నృత్యాలే ఈ చోడి గాని కలాపంలోనూ కనిపిస్తున్నాయి. ఈ కలాపంలో జిక్కిణీ చిందు మొదలైనవి విశేష నాట్యాలు. ఇది భార్యభర్తల సంవాదం అవడం వలన ప్రేక్షకులను ఎక్కువ ఆనందపరిచేది.

భామాకలాపం, గొల్ల కలాపం మాదిరే ఈ చోడిగాని కలాపం కూడ నృత్య రూపకం. సూత్రధారుడే విదూషక స్థానాన్ని అలంకరిస్తాడు.

చోడిగాని కలాపంలో ఉపయోగించే ఒంకి కఱ్ఱ ఒక ముఖ్యమైన విశేష మనీ, భరత్గ శాస్త్రంలో 'బ్రహ్మకుటిలకందద్వా'త్తని ఒక వాక్యం వుందనీ ఆ కుటిలకం విదూష కోవ యోగిగా అభినవ గుప్తులు వ్వాఖ్యానించారనీ, ఆనాడు బ్రహ్మదేవు డిచ్చిన వంక కర్ర ఈ నాటికి తెలుగు వారి వద్ద ఉండటమే చోడి గాని కలాపం లోని ఒక శాస్త్రీయమైన విశేషమనీ, శ్రీ ముట్నూరి సంగమేశం, సాళ్వ కృష్ణమూర్తి గార్లు భారతిలో ఉదహరించారు.

అసలు ఆధారం ఇల్లిదిగో ఇదీ:

చెంచునాటకం, ఎఱుకల కథ, ఎఱ్ఱ గొల్లల భాగవతం మొదలైన వాటన్నిటికీ మూలమైన చెంచులక్ష్మి నృసింహుల ప్రణయ గాధే ఈ చోడి గాని కలాపానికి ఆధారం. అనేక కురవంజి రచనలకు మూలాధారం ఈ ప్రణయ కలహమే.

ఈ కథావస్తువైన చెంచు లక్ష్మి నృసింహుల వివాహ గాథను కీ.శ. 1600 ప్రాంతంలో గరుడాచల మహాత్య మను పేర ఓబయమంత్రి యక్షగానంగా వ్రాశాడు. ఆ నాటికీ, ఈనాటికీ దక్షిణ దేశ భాషల్లో కొరవంజులలో దీనినే ప్రాచీన కృతిగా చెప్పుకోవచ్చు.

ఈ చోడిగాడి కలాపానికి ఎఱుకల కథ అని కూడ పేరు. తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో 'ఎఱుకల కథ ' అనే పేరుతో ఒక రచన వుంది. ముఖ్యంగా ఈ కలాపాలు వ్రాసిన వారిలో చెంగల్వ రాయ కవి - అరవెల్లి వేంకటార్యుడు -వంకాయల బలారామభుక్త - గొడవర్తి జగన్నాథం మొదలైన వారి రచనలు ముఖ్యమైనవి.