తాళగాళ్ళలో ఒకడు ఈ నాయకీ నాయకులకు మధ్యవర్తిగా తోడ్పడుతూ, అనేక ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పిస్తూ, కథా సంధుల్ని విపులంగా సభ వారికి ఎరుకపరుస్తూ వుంటాడు.
సింగి కోసం విసిగి వేసారిన సింగడు, సింగిని చూపమని స్వామిని ఇలా ప్రార్థిస్తాడు.
నింగినీ గానవుగా ఓ నా స్వామీ, సింగినీ గానవుగా
అంగ వంగ కళింగ బంగాళ జనులకు
కొంగు బంగారమై, కోర్కె లిచ్చిన స్వామి. ॥సిం॥
తాటకి తలగొట్టీ, సుబాహుని గొట్టీ
మారీచుని మట్టీ, గాథిరాజు పట్టీ
యజ్ఞము చేతబట్టి, హరుని విల్లు ముట్టి
ముక్కలు జేసి దట్టి, జగజ్జట్టీ. ॥సిం॥
అని వేడుకుంటాడు. కథా గమనంలో సింగిని వెదుక్కుంటూ, సింగడు అడవిలో కనపడిన మృగాలను వేటాడి, అవి లభించి నప్పుడు ఆయా దేవతల్ని సింగిని చూపమని ప్రార్థిస్తూ పోతాడు. ఈ ఘట్టంలో అఖేట నృత్యం ప్రదర్శింపబడేది. ఆ తరువాత దశావతరాలను అభినయించి నారాయణ మూర్తిని ప్రార్థించే వాడు. తరువాత రామాయణ గాధను స్మరించి శ్రీరాముని వేడుకుని రామాయణ గాథనంతనూ, పదాభినయం ద్వారా ఆభినయిస్తూ సింగి కనపడలేదనే ఆవేదనతో స్పృహతప్పి తూలిపడిపోతూ నిష్క్రమిస్తాడు.
- ఇంతలో సింగి:
ఇంతలో సింగి ఎరుకో ఎరుకో అంటూ ప్రవేశిస్తుంది. సూత్రధారుడు సింగి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అంతట సింగి అతనికి సమాధానంగా తనయొక్క కుల గోత్రాలను గూర్చి, వృత్తి విద్యా విలాసాలను గురుంచి తన వన్నె చిన్నెలు అందచందాలను వివరిస్తూ సింగని వర్ణిస్తుంది. ఈ సమయానికి సింగడు ప్రవేశించి, సింగి దొరి