పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
హంగులు, ఆయుధాలు, అలంకారాలు:

ఇక ప్రదర్శనానికి కావలసిన పరికరాలను, మిగిలిన హంగులన్నింటినీ కూడ తయారు చేసుకుంటారు. రథాలు, గుఱ్ఱాలు, అంబులు, బాణాలు, గదలు, ఈటెలు, సైన్యం మొదలైన వాటినన్నిటినీ కూడ తయారు చేసుకుని ప్రదర్శనం రోజున వివరంగా విడదీసి ప్రదర్శన గమనాన్ని బట్టి ఈ బొమ్మలన్నిటినీ సక్రమంగా, సిద్ధంగా అమర్చి పెట్టుకుని, ఒక బొమ్మ తరువాత మరొక బొమ్మను తెరమీదీకి ఎక్కించి కథను ముందుకు నడుపించుతారు. ఈ బొమ్మల్నిగానీ, పరికరాలను గానీ విడివిడిగా సూస్తే ఏదో తోళ్ళ ముక్కల్లాగ కనిపిస్తాయి. వీటి సహజమైన అందం ఆముదపు దీపాల వెలుగులో తెరమీదే చూడాలి. ఎంతో రమణీయంగా వుంటాయి. కష్టమో, నష్టమో పడి ఒక్కసారి ఈ బొమ్మల్ని తయారు చేసుకుంటే ఇంక అవి 20 సంవత్సరాలవరకూ చెక్కు చెదరకుండా వుంటాయి. ఒక వేళ మధ్య మధ్య కొన్ని బొమ్మలు శిధిలమైతే వాటిని అప్పటి కప్పుడు పూర్తి చేసుకుంటారు . ఈ బొమ్మల్ని అన్నిటికన్నా పెద్ద సైజు బొమ్మకు తగినంత వెడల్పూ, పొడవూగల మేదర పెట్టెల్లో అమరుస్తారు. ఒక్కో ప్రదర్శనానికి ఒక్కొక్క పెట్టెను వుంచు కుంటారు.

బహిరంగ ప్రదర్శనశాల:

ఈ బొమ్మలాట ప్రదర్శకులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బండ్లమీద ప్రయాణం చేస్తారు. ఒక్కొక్క దళానికి ఒకటి గాని, రెండు గాని బండ్లు వుంటాయి. ఒక బండి మీద సామానులు, రెండవ బండిమీద మనుషులు ప్రయాణం చేస్తారు.

గ్రామంలో ప్రవేశించి పెద్దల్ని, పిన్నల్ని కలుసుకుని పరిచయం చేసుకుంటారు. అందరూ కూర్చోవటానికి అనువుగా వున్న బహిరంగ స్థలంలో పందిరి ప్రారంబించి, మూడు ప్రక్కలా మూయబడి ఒక ప్రక్కన తెర కట్టడానికి వీలుగా పందిరి వేస్తారు. ఈ పందిరి కొంచెం ముందుకు వాలి వుండేటట్లు కడతారు. ఇలా కట్టడం వల్ల వారు ఆడించే బొమ్మలు జారిపోకుండా వుంటాయి. పందిరి లోపలి భాగంలో వారి మొత్తం సామగ్రీ, పిల్లలూ, భార్యలూ, సంసారమంతా అందులోనే