పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నదా అనిపిస్తుంది. వెనుక పక్క కూడా మూతతో అందరూ లోపలే వుంటారు. లోపలి ప్రక్క తెరను ఆనుకుని ఒక పెద్ద బల్లను వేస్తారు.

వరుసగా ఆముదపు దీపాలను అమరుస్తారు. ఈనాడు కొందరు పెట్రోమాక్సు లైట్లను వాడుతున్నారు. కాంతి తగ్గకుండా ఎప్పుడూ ఒకరు ఆముదపు దీపాల ఒత్తులు ఎగదోస్తూ, కొరతబడ్డ ఆముదాన్ని పూర్తిచేస్తూ వుంటాడు. దీపాల కాంతి తగ్గితే బొమ్మల అందచందాలు తగ్గుతాయి.

తెరమీద బొమ్మలతో ప్రదర్శన ప్రారంభం:

ప్రదర్శనం ప్రారంభించే రోజున 'ఈరాత్రికి బొమ్మలాట వుందహో ' అని చాటింపు ద్వారాగాని, ఇంటింటికీ వెళ్ళి చెప్పడం ద్వారా గాని అందరికీ ఈ వర్తమానం చెలియ జేయ బడుతుంది.

బొమ్మలాటకు తెర సిద్ధం చేసిన తరువాత ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని బొమ్మను తెరకు మధ్యగా ఎక్కించి వుంచుతారు. ఒక పక్క మాత్రం దిష్టిబొమ్మ నొకదానిని, రెండవ ప్రక్క జుట్టుపోలిగాణ్ణి ఎక్కించి వుంచుతారు.

తోలుబొమ్మల్ని తెరమీద ఆడించడానికి వీలుగా ఒక వెదురుబద్దను బొమ్మకు మధ్యభాగంలో కడతారు. బొమ్మను ఆడించాలంటే ఈ బద్దే ఆధారం. బొమ్మను ఆడించే సమయంలో చేతిని తెరమీదకు ఏ మాత్రం రానీయరు. ఒక వేళ వస్తే మనిషి బొమ్మ కనబడుతుంది. అందువల్ల దూరంగా వుండి ఒక చేతిలో బొమ్మను బట్టి రెండవ చేతిలో మరో చిన్న కొంకి గల బద్దను పట్టుకొని బొమ్మ యొక్క చేతులకు తగిలించి, సంభాషణల ప్రకారం బొమ్మల్ని కదిలిస్తూ వుంటారు. కాళ్ళు మాత్రం ఎటుబడితే అటు కదిలే లాగా మన దసరా వుత్సవాల్లో పిల్లలు పుచ్చుకునే కోతి బొమ్మ మాదిరి కీలు కూలు వద్దా రంధ్రాలు పొడిచి ఎటు పడితే అటు తిరగడానికి వీలుగా అమరుస్తారు. ఒక వేళ తెరమీద బొమ్మ కొంచెంసేపు చలనం లేకుండా వుండాలంటే ఒక