పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బొమ్మలాటలవారు బెల్గాం, కొల్హాపూర్స్, సతారా, పూనా, బిజాపూర్ ప్రాంతాల నుండి, పరిపాలకుల జైత్ర యత్రల్లోనూ, ఆయా దేశాలలో వచ్చిన విప్లవోద్యమాల మూలంగానూ వలస వచ్చారు.

TeluguVariJanapadaKalarupalu.djvu

శ్రీశైలం శివరాత్రి మహోత్సవాలలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించి నట్లు పండితారాధ్య చరిత్ర పర్వత ప్రకరంలో పాల్కురికి సోమనాథుడు ఈ విధంగా వివరించాడు.

భారతాది కథల జీరమఱిగి - నారంగ బొమ్మల నాడించు వారు
గడు నద్భుతంబుగ గంబ సూత్రంబు లడరంగ బొమ్మల నాడించు వారు.

అనడాన్ని బట్టి శ్రీశైలం వెళ్ళే ద్రావిడ యాత్రికులతో బాటు పైవలస వచ్చిన బొమ్మలాట వారు కూడ వుండి వుండవచ్చు. దీనిని బట్టి ఆంధ్రదేశంలో కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఈ బొమ్మలాటలు ఆదరింప బడి ప్రజాభిమానం పొందుతూ వున్నాయని స్పష్టమౌతుంది.

మన వాజ్మయంలో పాల్కురికి సోమనాథుని కాలంనుండి తంజావూరు రఘునాథ రాయల కాలంవరకూ అనేక మంది కవులు బొమ్మలాటలను పేర్కొన్నారు. "ప్రతిమ లాడగ బట్టిన యట్లు" అని పల్నాటి చరిత్రలో శ్రీనాథ మహాకవి పేర్కొన్నాడు.

బొమ్మలాటల గురించి నాచన సోమన ఉత్తర హరివంశంలో__

"యంత్రకు డాడించి యవని ద్రోచిన వ్రాలు
బొమ్మల గతి రథపూగములను"

అని వివరించాడు. బొమ్మలాటల వారు గోన బుద్ధారెడ్డి రామాయణంలోని ద్విపదలను పాడేవారని సురవరం ప్రతాప రెడ్డిగారు 'సాంఘిక చరిత్ర ' లో వివరించారు. భాస్కర శతకాన్ని వ్రాసిందెప్పుడో తెలియదు గాని, అతని కాలంలో తోలుబొమ్మలాటలు వ్వాప్తిలో వున్నట్లు భాస్కర శతకంలో ఈ క్రింది పద్యం ద్వారా తెలియవస్తూంది.