పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బొమ్మలతో చక్కగా నాట్యం త్రొక్కిస్తారు. ఆపైన వెనుక నుంచి సూత్ర ధారుడు ఎంతో చాకచక్యంగా పాత్రాభినయం చేయిస్తూ వుంటాడు. నాటక ప్రదర్శనానికి ఎన్ని హంగులుండాలో దాదాపు అన్ని హంగులూ బొమ్మలాటలోను వుండాలి. ఇన్ని హంగుల్నీ వారు ఎక్కడ నుంచి పూర్తి చేసుకొంటారు? కిరాయి నటీ నటుల్ని ఎక్కడ నుంచీ దించరు. జట్టు పెద్దలు పురుష పాత్రలు, వారి స్త్రీలు స్త్రీ పాత్రలు వహిస్తారు. భర్త శ్రీరాముడుగా వాచికం చెప్పి పాట పాడితే, భార్య సీతగా వాచికం చెప్పి వంత పాడుతుంది. ఇక వారి బిడ్డలు బాలికల పాత్రలకు అభినయాన్నిస్తారు.


ఈ విధంగా అయాపాత్రల బొమ్మలు పుచ్చుకుని కార్య క్రమాన్ని దిగ్విజయంగా నడుపుతారు. తెరమీది బొమ్మలు ఎంత వుధృతంగా నాట్యం త్రొక్కుతూ వుంటాయో, లోపలి భాగంలో వున్న వ్వక్తులు కూడా దాదాపు అంతటి అభినయాన్నీ వ్వక్తం చేస్తూ వుంటారు.

దేశవ్యాప్తంగ బొమ్మలాటలు:

ఈ బొమ్మలాటలు - ఒక్క ఆంధ్ర దేశంలోనే కాకుండా పరిసర ప్రాంతాలైన మహారాష్ట్రం, మళయాళం, తమిళం, బెంగాల్ మొదలైన ప్రాతాల్లోనూ వ్యాపించి వున్నాయి. ఉత్తర దేశంలో 'కట్ పుత్లీ' అనే కొయ్య బొమ్మలాటలు, దక్షిణదేశంలో కీలు గుఱ్ఱపు బొమ్మలాటలూ, బొమ్మలాట్టం అనబడే కొయ్య బొమ్మలాటలు ప్రచారంలో వున్నాయి. ఈ నాడు మనం చూసే బొమ్మల వస్త్రధారణా, భూషణాలంకార పరిశోధనా చూస్తే - ఈ మాదిరి అలంకారం గల నాగరికత తంజావూరు ఆంధ్రరాజుల కాలంలోనిదిగాను, మహారాష్ట్ర రాజుల కాలంలోనిది గానూ నిదర్శనాలు కనిపిస్తున్నాయి.

తొలుబొమ్మలాటలు ప్రదర్శించే వారు చాలవరకు మరాఠీ వారు. వీరిని కన్నడంలో 'కిషేషిక్యాత ' జాతివారని, తమిళదేశంలో 'కెల్లెక్యాతవా 'రని, తెలుగు దేశంలో బొమ్మలాట వారని, చర్మ నాటకులనీ వ్వవహరిస్తున్నారు.

ఆంధ్రదేశంలో ప్రదర్శించే తోలుబొమ్మలాటలు మహారాష్ట్రం నుంచి సంక్రమించాయనే చరిత్ర కాధారాలున్నప్పటికీ, చాళుక్య రాజుల కాలంనాటికే తోలు బొమ్మలాట లాడినట్లు భారతం విరాట పర్వంలో వివరించబడింది.