అక్షయంగా వెలుగొందిన యక్షగానం
ఒకనాడు యక్షగాన వాజ్మయం దక్షిణ భారతదేశంలో అంతటా దేదీప్యమానంగా వెలుగొందిందనటానికి కారకులు మన జక్కులవారే.
యక్షగానాలన్నా జక్కులవారన్నా ఈనాటి వారిలో కొంత హీనదృష్టి వుంది. కాని ఆంధ్రదేశంలో శతాబ్దాల తరబడి యక్షగాన వాజ్మయం, యక్షగాన కళా రూపాలు విచ్చల విడిగా ప్రచారంలో వున్నాయి.
జక్కుల వారు విద్యావివేకాల్లో ఘటికులు. ప్రాచీన జాతుల్లో జక్కులు...బవని వాండ్లు మొదలైన వారు, మేధావి వర్గంగా ఎంచబడేవారు. సంగీత సాహిత్యాల లోనూ, చిత్రశిల్ప కళా ప్రతిభల్లోనూ, అద్వితీయ స్థానాన్ని సంపాదించారు. ప్రతిభావంతులుగా పేరు పొందారు.
ఈనాటి వైదుష్యం:
ఈనాడు కూచిపూడి భాగవతుల కళా వైదుష్యాన్ని మనం ఎలా స్తుతిస్తున్నామో అలాగే నాటి జక్కుల వారిని, బవని వాండ్లనూ స్తుతించేవారు. కాని వంశ పారంపర్యంగా వీరి కళాకౌశలం క్షీణిస్తూ వచ్చింది. ఉన్నతాదర్శాలు నశించాయి. ఆనాటి యక్షగాన వాఙ్మయానికి ప్రతీకగా ఈనాడు, ఆచ్చు గ్రంథాల నైతేనేమి, వ్రాతప్రతులైన తాళపత్ర, సాధారణ పత్ర గ్రంథాలైతే నేమి నాలుగు వందల వరకూ యక్షగాన రచనలున్నాయని వినికిడి.
అయితే కొండవీటి రెడ్డిరాజుల కాలంలోనూ విజయనగర రాజుల కాలంలోనూ, తంజావూరు ఆంధ్రనాయక రాజుల కాలంలోనూ, యక్షగానాలూ యక్షగాన వాఙ్మయం దేదీప్యమానంగా వెలుగొందిన విషయం సర్వసామాన్యంగా అందరికీ తెలిసిందే.