పుట:Tatwamula vivaramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వము తనలోని ఆత్మను తెలిసిన జ్ఞానులు ఆత్మతో కలిసి యోగము పొందినవారైవున్నారు. అటువంటి జ్ఞానులు ఆత్మతో కలియకముందు "తత్త్వం" అన్నవారు ఆత్మతో కలిసిన తర్వాత "తత్త్వమసి" అన్నారు. దీనిని విడదీసి చూచితే తత్‌+త్వం+అసి= తత్త్వమసి అనిగలదు. తత్‌ అనగ ఆత్మ అని, త్వం అనగ నేను అని, అసి అనగ కలసిపోయాము అని అర్థము. ఆత్మతో కలసినవాడు భూమి మీద శరీరముతో ఉండి బ్రహ్మయోగిగ ఉండును. అందువలన శరీరముతో బ్రతికివున్నవాడు "తత్త్వమసి" అనగలిగాడు. అదే పరమాత్మతో కలసిపోతే వానికి శరీరముండదు కావున వాడు ఏమియు అనే దానికుండదు. అందువలన ఆత్మను అనగ తత్‌ను తెలుసుకొన్న జీవుడు త్త్వం అన్నవాడు తత్‌లో కలసిపోయి తత్త్వమసి కాగలడు. ఇప్పటికైన తత్త్వం అను పదమునకు అర్థము తెలిసి, జీవాత్మ ఆత్మలను తెలుపు పాటలకు, పద్యములకు తత్త్వమని పేరు పెట్టారని తెలిసి, రెండు ఆత్మలు శరీరములోనే ఉన్నాయని తెలిసి, తత్త్వమునకు శరీరాంతర్గతములోనే అర్థము చెప్పుకోవలెను. ఇదే సూత్రమును అనుసరించి "తత్త్వముల వివరము" అను ఈ గ్రంథములో వ్రాసిన పాటలకు పద్యములకు శరీరములోనే వివరించి చెప్పాము. వేయి పుస్తకములు చదువుటకన్న వేమన పద్యమొకటి చదువుట మిన్న అన్నట్లు, వేయి పాటల తత్త్వములను పాడుకొనుటకంటే ఒక్క తత్త్వమునకు వివరమును తెలియుట మిన్న. అందువలన తత్త్వములను పాడుకొనుటలో ఉపయోగము లేదు కాని తత్త్వమును అర్థము చేసుకొంటే అది ఉపయోగమై "తత్త్వమసి" కాగలవు.


ఇట్లు

ఇందూ ధర్మప్రదాత,

సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త

ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు