పుట:Tatwamula vivaramu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరీరమునకు కళ్లు రెండు రంధ్రములు, చెవులు రెండురంధ్రములు, ముక్కు రెండురంధ్రములు, నోరు ఒక రంధ్రము, అలాగే క్రింద గుదము, గుహ్యము అను రెండు రంధ్రములు మొత్తము కలిపి తొమ్మిది రంధ్రములు గలవు. అందువలననే శరీరమును తొమ్మిది రంధ్రములుగల పుట్ట అని అన్నారు. తొమ్మిది రంధ్రముల విషయములను మనస్సు యొక్క ఆలోచనకు తెచ్చుకోకపోతే లోపలయున్న ఆత్మవిూద మనోధ్యాస ఏర్పడును. దానివలన ఆత్మ తెలియును. కావున తొమ్మిది వాకిల్లు మూసి పామును నెమ్మదిగ పట్టవలెనన్నారు. ఒక్క మారుగ మనస్సు ఆత్మ విూదికి పోదు అందువలన కొంత సాధన ద్వార అది సాధ్యపడును. కావున పామును నెమ్మదిగ పట్టవలెను అన్నారు. సాధన ద్వార బయటి విషయముల విూదికి మనస్సును పోనీయక లోపలనున్న ఆత్మ విూద నిలుపడమును చెప్పుచు తొమ్మిది వాకిల్లు మూసి చందమామ పామును నెమ్మదిగ పట్టవలెను చందమామ అని మూడవ చరణములో అన్నారు.


 4) భక్తియను కట్టుకట్టి చందమామ, పామును యుక్తిచేసి పట్టవలెను చందమామ ||చం||

శరీరములోని ఆత్మను దర్శించుకోవాలంటే మనిషికి భక్తియనునది ముఖ్యము. భక్తికి ఆత్మవశమై పోతుంది కావున భక్తికలవారికి ఆత్మయందైక్యము లభించును. బయట పాములవాడు మంత్రము చేత కట్టుకట్టి పామును కదలకుండచేసి పట్టుకొనుచున్నాడు. అదే విధముగ లోపలగల ఆత్మయను పామును భక్తియను మంత్రముచేత యోగము అను యుక్తిచేత పట్టవలెనని నాల్గవచరణములో చెప్పారు.


 5) దేహ దేహములందు చందమామ, పాము తెలియకుండ చుట్టుకొన్నది చందమామ ||చం||