పుట:Talli-Vinki.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ నీలకంఠశాస్త్రి గారికి తోడుగ, మరి యిద్దరు పండితులు బ్రాహ్మీభూషణ శ్రీ రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు, పరమ మాహేశ్వరులు, పండిత పరమేశ్వరులు శ్రీ మిన్నికంటి గురునాథ శర్మగారు శ్రీ దాసుగారి అచ్చ తెనుగు అనువాదమును చదివి ఆనందించి వారి అభిప్రాయములొసగిరి. వారికి గూడ మా అభినందనలు.

ఈ గ్రంథ ముద్రణ విషయములో అనేక సలహాలు ఇచ్చి ముద్రణ చేయురీతిని ప్రణాళికను చేసి, ఈ పుస్తకము చివరి నాలుగు అనుబంధములు రచియించి, దాసభారతివి సుందరముగా ఉజ్జ్వలింపచేసిన మహాకవి, మధుర సరస్వతి, ఆచార్య యన్. వి. జోగారావు గారికి నానమస్సుమనస్సులు. అంతియేగాక ముద్రణ ప్రదాత అయిన శ్రీ పోలిశెట్టి సీతారామాంజనేయులు గారి వంశావళి పద్యములు మేము కోరినవెంటనే వ్రాసిపెట్టి మాకృతజ్ఞ ను ముద్రణ ప్రదాతలకు వెల్లడి చేసికొనుటకు సదవకాశము కల్పించిరి. ఈ కార్యమునకు వారికి మాప్రత్యేక అభినందనలు సమర్పించు కొనుచున్నాను.

తెలుగు పాఠకులు, కొంచెము ఓపికతో శ్రీ దాసుగారి అనువాదమును చదివి, దాస హృదయమును అర్థము చేసికొని ఆనందించి మా ప్రయత్నమును సార్థక పఱతురు గాక! అచ్చ తెనుగు గ్రంథరాజములలో ఇయ్యది ఎనలేనిదై వెలుగుగాక!.


ఇట్లు

కర్రా ఈశ్వరరావు.

ప్రకాశకుడు.