పుట:Talli-Vinki.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దినములయిన పిమ్మట, ముద్రాపకులవద్ద పుస్తక ముద్రణకగు ఖర్చు జాబితా తీసుకొని శ్రీ సీతారామాంజనేయులగారి దగ్గరకు వెళ్లగా వారు అది చూచి 500 ప్రతులు అచ్చు వేయుటకు అంగీకరించి, మమ్ములను కార్యోన్ముఖులను చేసిరి. తరువాత చక్కని లలితా పరమేశ్వరి త్రివర్ణ చిత్రము, శ్రీ చక్రముకూడ నున్న బాగుండునని శ్రీ ఆంజనేయులుగారు సెలవీయగా వానిని గూడ సేకరించి, ఇందులో వేయించితిమి. భక్తులు, సాహితీ వేత్తలు ఈ ముఖచిత్రములు చూచి ఆనందింతురని మాఅభిసంధి. వారి సాహాయ్యమే లేకున్న ఈ పుస్తకము అచ్చు అగుట చాల పరిశ్రమతోకూడుకొన్నపని. ఇంత త్వరలో మేము ప్రచురించి యుండెడివారము కాము వారి సాహాయ్యమునకు ఆ పరమేశ్వరియే తుష్టురాలై వారికి, వారి కుటుంబమునకు ఆయురారోగ్యైశ్వర్యములు ప్రసాదించుగాక అని ప్రార్ధించుచున్నాము.

ఇది పారాయణ గ్రంథముగా నుండుటకు, నిత్యపారాయణ కనుకూలముగా, తొలుదొలుత లలితా సహ స్రనామములు అచ్చు వేయించితిమి తరువాత ప్రతినామము ప్రత్యేకముగా శ్రీ దాసుగారి వివరణతో అచ్చు వేయబడినది.

ఏతద్గ్రంథమునకు సంపాదకత్వము వహింపుడని మేము కోరిన వెంటనే, వేదాంత పారీణులు, విద్యోభయ భాషా ప్రవీణులు బ్రహ్మ నిష్ఠులు శ్రీఓరుగంటి నీలకంఠశాస్త్రి మహోదయులు, సంతోషముతో అంగీకరించి గ్రంథమునంతయు ఆమూలాగ్రము చదివి, తమ అమూల్యమైన తొలిపలుకుతో పాఠకలోకమునకందించిరి. తాము విశ్వ విద్యాలయమున పరిశోధకులుగా తమకాలమునంతయు వినియోగించు చున్నపుడు, శ్రీదాసుగారి మీద భక్తివలన, మామీదనున్న అభిమానము పురస్కరించుకొని తమ అమూల్య కాలమును వీని కొరకై వినియోగించి ఈ పుస్తకము ఈ రూపముగా అచ్చు అగుటకు సహాయమునందచేసిరి. వారికి నాకృతజ్ఞతా పూర్వకములైన అభినందనలు.