పుట:TELUGU-NAVALA.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

29

ఏయే ప్రదేశాలలో ఏయే విధంగా దగా, కుట్ర, మోసం, వంచన అభ్యుదయ పరంపరాభివృద్ధిగా విజృంభిస్తున్నాయో, అన్న దాఖలాలతో యీ నవలలో చూడవచ్చు. భగవంతుడిపట్లా, ఆయన ఏర్పరచిన కర్మ సిద్ధాంతంపట్లా, ఈ నవల చదివినవాళ్ళకు సందేహాలు తప్పకుండా కలుగుతాయి. అది రచయిత గొప్ప ప్రతిభకు తార్కాణం. మునిసిపాలిటీలు,కోర్టులు, ఎన్నికలు, రాజకీయ పార్టీలు, గొప్ప గొప్ప ఇళ్ళవాళ్ళ రంకులు, బొంకులు, సారాకొట్లు, సానిసంసారాలు, ఒకటేమిటి మహాభారతంలో లేనిది లేదు అందే భూప్రపంచకంలో ఏదీ ఉండదు అన్నట్లుగానే ఆధునిక మహాభారతంలో ఈ వ్యవస్థలో జరుగుతున్న చరిత్ర అంతా సర్కస్ చూస్తున్నంత సరదాగా, సినిమా చూస్తున్నంత స్పష్టంగా చూపించారు రచయిత. ఇందులోని వర్ణనలు, భాష. భావ ప్రకటనలోని శక్తిసామర్థ్యాలు ఇదివరకు తెలుగు సాహిత్యంలో విన్నవీ కన్నవీకావు. చాలా శక్తిమంతమైనవి. సుమారు నాలుగు వందల పేజీల గ్రంథం యీ నవల. అయినా ఇది అసంపూర్ణం. తెలుగు నవలా సాహిత్యంలోనే ఇది బహుకాలం పేరు ప్రఖ్యాతులతో నిలిచివుంటుందనడానికి సందేహంలేదు

ఈ తరం రచయితలలో చెప్పుకోదగిన రచయిత శ్రీ మహీధర రామమోహనరావుగారు స్పష్టమైన రాజకీయ సిద్ధాంతపరిజ్ఞానం, విశేషమైన జీవిత ప్రత్యక్షానుభవం. చెప్పదలచుకొన్నది సూటిగా, సరళంగా చెప్పగల నేర్పుగల రచయిత వీరు.

ఓనమాలు, రథచక్రాలు, దవానలం అనే పేర్లతో, తెలంగాణాలో శతాబ్దంలో జరిగిన భూస్వామ్య వ్యతిరేకోద్యమాన్ని ఇతివృత్తంగా మూడు నవలలుగా వ్రాశారు రామమోహనరావు గారు. ఆనాటి కర్షకుల, కార్మికుల దయనీయమైన పరిస్థితులు, ఉద్యమసారథుల త్యాగజీవితాలు క్రూరమైన ఫ్యూడల్ రాజ్యాధికార యంత్రాంగపు చావుకళలు, సమర్థవంతంగా వర్ణించారు ఈ నవలల్లో రచయిత. ’కొల్లాయి గట్టితేనేమి?' అనే నవలలో ఈ శతాబ్ది ద్వితీయ పాదంలోని గాంధీజీ నాయకత్వం క్రిందసాగిన స్వాతంత్ర్యోద్యమం తెలుగుదేశాన్ని ఏవిధంగా ప్రభావితం చేసిందో వర్ణించారు. స్వయంవరణం వంటి సామాజిక సమస్యాత్మక నవలలను రచించారు. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందాలనీ, మగవాళ్ళతోపాటు అన్ని రంగాలలోను సరిసమానంగా నిలవాలని, రామమోహనరావుగారి నవలలు ప్రతిపాదిస్తాయి.