పుట:TELUGU-NAVALA.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

తెలుగు నవల

తెలంగాణలో భూస్వామ్యవ్యతిరేక పోరాటాన్ని వర్ణించే మరొక నవల వట్టికోట ఆళ్వారుస్వామి గారి 'ప్రజలమనిషి'. తరతరాలు అణగదొక్కిన, అక్షరాస్యతలేని, సామాన్య జనంలో చైతన్యం తీసుకొనిరావడానికి ఉద్యమ కార్యకర్తల కృషీ, వారి త్యాగ జీవితాలు, ప్రజలమనిషి నవలలోని ఇతివృత్తం. జాగిర్దారుల, భూస్వాముల, అధికారుల దౌర్జన్యాలు, క్రమంగా ప్రజలలో తమ హక్కులను గురించి, అగచాట్లను గురించి అవగాహన కలగటం, స్వర్గీయ ఆళ్వారుస్వామి చక్కగా వర్ణించారు. ఈయన 'గంగు' 'గిర్దావరు' మొదలైన నవలల్లో తెలంగాణా ప్రాంతపు సామాజిక జీవితాన్ని వర్ణించారు.

1050 వ సంవత్సరంలో వెలువడిన మరొక గొప్ప తెలుగు నవల ఉప్పల లక్ష్మణరావుగారి 'అతడు-ఆమె'. తెలుగు నవలాసాహిత్యంలోనే ఈ నవలకు ఆపూర్వమైన స్థానమున్నది. ఇందులో రచయిత చూపిన శిల్పం చాలా మెచ్చదగినది. ఆసాంతమూ, నాయికానాయకుల దినచర్య లేఖనంగా ఈ నవలను నిర్వహించారు. లక్ష్మణరావుగారు. ఈ నవలలో శైలి దానికదే సొటి, లక్ష్మణరావుగారి బహుముఖ ప్రజ్ఞ, విస్తారమైన లోకానుభవం, వివిధ దేశ పర్యటనానుభవం, పాండిత్యం ఈ నవలలో ప్రత్యేకమైన ముద్రతో కన్పిస్తాయి. ఎమ్. ఏ. ప్యాసై, క్వీన్ మేరీస్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్న శాంత, సీమ నుంచి బారిస్టరై వచ్చిన చిదంబరణాశ్రీ ప్రేమించుకొని పెళ్ళిచేసుకొని, సంసారయాత్ర సాగించిన ఘట్టాలన్నీ ఎవరికి వారు వారి దృక్పథంతో డైరీలలో వ్రాసుకొన్నారు. ఈ విధంగా డైరీలలో ఇంత పెద్ద నవలను వ్రాయడం గొప్ప ప్రజ్ఞ అనే చెప్పాలి. భార్యా భర్తలిద్దరూ విద్యాధికులు, ప్రపంచ విషయాలన్నీ తెలిసినవాళ్ళు వీరి డైరీలలో నవల నంతా ఉత్కంఠను పోషిస్తూ నడపడం ఈ నవల ప్రత్యేకత. ఈ శతాబ్దపు రెండోపాదంలోని చెన్న పట్టణంలోని ఆధునిక సమాజం, తెలుగు దేశంలో వచ్చిన మార్పులు. రాజకీయాలు, ఎన్నికలు, ఖద్దరు, గాంధీఉద్యమం కోర్టులు, కేసులు, లావాదేవీలు, డాక్టర్లు, లాయర్లు, వాళ్ళ సంపాదనలు, ఒకటేమిటి ఎన్నెన్నో సంగతులు ఈ నవలలో చోటుచేసుకొన్నాయి.

తెలుగు నవలాసాహిత్యం శాశ్వతంగా ఋణపడి వుండవలసిన నవల వ్రాసినవాడు స్వర్గీయ తెన్నేటి సూరి. చంఘిజ్ ఖాన్ ఆ నవల. ఉత్తమ కళాఖండంగా ఈ నవల నాయన రూపొందించారు.తెలుగులో చారిత్రక నవలలన్నిటిలో ఇది కోటి కాంతుల కోహినూరులా తళతళ లాడే నవల. అద్భుతమైన