Jump to content

పుట:TELUGU-NAVALA.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

27

ఆంధ్ర విశ్వకళా పరిషత్, పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించడం కోసం చారిత్రక నవలల పోటీలు నిర్వహించింది. శ్రీమతి మల్లాది వసుంధర ఈ పోటీలలో రెండుమూడు సార్లు బహుమానాలు గెల్చుకొన్నారు. ఈమె దూరపు కొండలువంటి సాంఘిక నవలలు కూడా వ్రాసినా, చారిత్రక నవలా రచయిత్రి గానే ప్రసిద్ధురాలు. ధూళిపాళ శ్రీరామమూర్తి, డా. పాటిబండ మాధవశర్మ, కొర్లపాటి శ్రీరామమూర్తి, మొదలైనవారు చారిత్రక నవలలు రచించారు. పిలకా గణపతిశాస్త్రి గారు కూడా కొన్ని చారిత్రక నవలలు రచించారు. వంగ దేశాన్ని ప్రభావితం చేసిన శరత్ చంద్రుడు, రవీంద్రుడు కూడా, అనువాదాల ద్వారా తెలుగుదేశాన్ని ప్రభావితం చేయడం జరిగింది. దేశికవితామండలి వంటి ప్రచురణ కర్తలు, శరత్ సాహిత్య సర్వస్వాన్ని తెలుగులో అందించారు అదేవిధంగా ప్రేమ్‌చంద్ , జైనేంద్రకుమార్ , కిషన్ చందర్ , ఇలాచంద్రజోషీ వంటి సుప్రసిద్ధ హిందీ రచయితల నవలలు కూడా ఆనువాదాలుగా తెలుగులో వెలువడ్డాయి.

యువతరం నవలారచయితలలో అగ్రగణ్యుడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి సంప్రదాయ ఛాందసాలపైన తిరుగుబాటు చేసి కథారచనలో నవలారచనలో విప్లవపంథా లేవదీసినవాడు. ఈయన తొలినాళ్ళలో రచించిన నవల అల్పజీవి, పాఠకులను, సాహిత్య విమర్శకులను ఆకర్షించింది. బాహ్య సంఘటనలను మాత్రమే వర్ణించి కథాగమనాన్ని నిర్వహించడంకాక అంతర సంఘర్షణలను కూడా నేర్పుతో అల్పజీవి నవలలో విశ్వనాథశాస్త్రి చిత్రించారు. నవలా రచనలోనే కొత్త ప్రయోగం అల్పజీవి. ఇందులో కథానాయకుడు సుబ్బయ్య. భయస్థుడు. పిరికివాడు. అవమానాలను, పీడనలను కిమ్మనకుండా సహించడం అతడి రక్త లక్షణం. లంచాలు తీసుకోలేడు వంచన మాటలు మాట్లాడలేడు. నిర్భయంగా తల ఎత్తుకొని వీథివైపుచూడలేడు. భార్యమీద కూడా తన దర్పాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించలేడు చిన్న తనంలో అతడిలో సుప్తచై తన్యంగా ప్రవేశించిన భీరుత్వం, ఆత్మన్యూనతాశంకగా పరిణమించి, తానెందుకూ కొరమాలినవాడనుకొనే నమ్మకం అతడిలో స్థిరంగా కుదురుకొన్నది. దానికి అతడి జీవితంలో ఎదురైన అనేక సంఘటనలు, వాతావరణమూ కారణాలు. గవరయ్య కాంట్రాక్టరు. అతడు చిన్నతనంలో పువ్వుల్లో పెట్టి పూజించుకొన్న భార్య కాస్తా లేచిపోయింది. ఈ గవరయ్య చదువుసంధ్యలు రానివాడైనా డబ్బు సంపాదించి ప్రయోజకుడైనాడు. ఇతడి కనుసన్నల్లో రౌడీలు మెలగుతారు. ఈ గవరయ్య పాత్ర చిత్రణనుకూడా