పుట:TELUGU-NAVALA.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

తెలుగు నవల


1940 లలో మంచినవలను వ్రాసిన వారు రావూరి సత్యనారాయణరావు గారు వీరి నవల 'నెలవంక' కృష్ణాపత్రికలో ధారావాహికంగా వెలువడి తరవాత 1942 లోనూ 48 లోనూ రెండుముద్రణలు పొందింది. లలితమైన భాషలో గంభీరమైన ఇతివృత్తంతో, ఈ నవల చాలామంది పాఠకులను ఆకర్షించింది.

తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియకు బహుళ ప్రచారం కలగ జేసిన వాళ్ళుకొవ్వలి, జంపన, సోమరాజు రామానుజరావు మొదలైన వారు. కొవ్వలి, జంపనల నవలలను రైల్వే సాహిత్యమని కొందరు అధిక్షేపించవచ్చుగాని, పాఠకు లలో విపరీతమైన పఠనాసక్తిని పెంపొందించిన కృషి, గౌరవం నిస్సందేహంగా కొవ్వలికి చెందుతుంది. కొవ్వలి నవలల్లో అనుచిత శృంగార వర్ణనలు, మితిమీరిన కాముక ప్రవృత్తులూ ఏవీ లేవు ఉత్కంఠ, కుతూహలం రేకెత్తించే అపరాధ పరిశోధన నవలలు వ్రాసిన వారు సోమరాజు రామానుజరావు.

భారత స్వాతంత్ర్య సముపార్జనకు అవ్యవహితపూర్వంగా వ్రాసిన నవలలన్నిటా స్వాతంత్ర్యోద్యమ ప్రభావము , కారాగారాలు. సత్యాగ్రహాలు, విదేశ వస్త్ర బహిష్కారం, జాతీయ ప్రబోధం, మొదలైన విషయాలు ప్రసక్తం కావటం చూడవచ్చు. చారిత్రక నవల వ్రాసినా, పౌరాణికేతి వృత్తాన్ని స్వీకరించినా, ఏదో సందర్భం తీసుకొనివచ్చి పారతంత్ర్యంవల్ల జాతీయ జీవనానికి వాటిల్లుతున్న హాని, స్వాతంత్ర్యం సముపార్జించుకోవలసిన ఆవశ్యకత, ప్రబోధించేవారు రచయితలు.

ఈ శతాబ్దం ఉత్తరార్ధం ప్రవేశించడంతో తెలుగునవల ఇతివృత్తంలో కూడా చాలా మార్పు వచ్చింది. వారపత్రికలలో అన్నిటికన్నా ఆకర్షణ ధారావాహికంగా ప్రచురించే నవల కావడంతో, నవలా రచయితలకు ప్రోత్సాహం లభించింది. వారపత్రికలలో నవలలు ప్రచురించడం తప్పనిసరి అయింది. వి డి. ప్రసాదరావుగారి వంటి రచయితలు ఆంధ్రపత్రిక వారపత్రిక లో మినువాక , నాకబలివంటి నవలలు ప్రచురించారు. స్వాతంత్ర్యానంతరం వారపత్రికల, మాసపత్రికల సంఖ్య కూడా పెరిగింది.

స్వాతంత్ర్యానంతర సాహిత్యంలో ఎంతో వైవిధ్యం ప్రవేశించింది మధ్య తరగతి కుటుంబాల ఇతివృత్తాలు, సాంసారిక బరువు బాధ్యతలు, ఆశయాలు, ఆదర్శాలు జీవిత సాఫల్య వైఫల్యాలు, మొత్తంమీద విస్తృతసామాజిక చిత్రణ ప్రాధాన్యం వహించడం చూడవచ్చు.