పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

335


గనుఁగొను కోరిక ల్నిగుడఁగా జనుదెంచిన వారలం గన
త్కనకగృహంబుల న్విడిదిగా నియమించి బహూకరింపుచున్.

21


చ.

మన యదువృష్ణిభోజకులమండలితోడ ఘటోత్కచాశ్రమం
బున కరుదెంచి వేగ బలపుత్రిక నయ్యభిమన్యుని న్సుభ
ద్రను గొనితేఱగావలయు దంతిరథాశ్వభటాంగముఖ్యసా
ధనము లలంకరించుమని దానవభేదనుఁ డానతీయఁగన్.

22


గీ.

పతి నియోగింప సాత్యకిప్రముఖు లెల్ల
వేణువీణామృదంగనిస్సాణతూర్య
దుందుభీనాదములు మింట నంది మ్రోయ
తత్క్షణమునందె కట్టాయితం బొనర్చి.

23


సీ.

పటురథాంచితచిత్రపటపటపటరవం
        బటఘంటికామహార్భటుల నెసఁగ
భటపటలీసముత్కటహుటాహుటిధాటి
        పటహతమ్మటలజంఝటల నొదుగ
చండవేదండప్రకాండఘీంకరణ మా
        ర్తాండమండలమెల్ల నిండియుండ
వరతురంగమఖరఖరఘర్షణధ్వని
        భీషణహేషాతిఘోష నెనయ


తే.

చలితచతురంగబలమహాకలకలముల
నిలకులాచలజాలముల్ దొలకి పొరలఁ
గేశవుండు ప్రలంబవినాశనుండు
పయనమౌచున్నతఱిని జూపట్టెఁ బురిని.

24


చ.

హితులు పురోహితు ల్వసుమతీశులు మౌనితతు ల్విలాసినీ
వతులు చిరంటికాసతులు వందిభటప్రతతుల్ నిజాహితుల్
వితతనుతుల్ మహోన్నతు లవీరత ధీరతశూరతాదివా
గతులితరీతిఁ దెల్పఁగఁ బ్రయాణములై బలకృష్ణు లున్నతిన్.

25