పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

మాముద్రాశాలలో కార్యనిర్వాహకుఁడుగానుండిన తోలేటి వేంకటసుబ్బారావుగారు నాకు తెలుపకయే నాచరిత్రము నొకదానినివ్రాసి వేసవికాలపు సెలవులలో నేను చెన్నపురికిఁ బోయి యుండినప్పుడు 1894-వ సంవత్సరమునందు మాముద్రాశాలలోనే దానిని ముద్రింపించెను. అటుతరువాత కొన్ని సంవత్సరములకు నేను చెన్నపురినివాసముగా నేర్పఱుచుకొని యచ్చటనున్న కాలములో నామిత్రు లనేకులు స్వీయచరిత్రమును వ్రాయవలసినదని నన్ను నిర్బంధపఱుపఁ జొచ్చిరి. వారి నిర్బంధమును మానుపుకోఁజాలక నాకంతగా నిష్టములేకపోయినను 1903.వ సంవత్సరమునందు స్వీయచరిత్రమును వ్రాయ నారంభించి వ్రాసినదాని నెప్పటికప్పుడే 112 పుటలు మాచింతామణి ముద్రా యంత్రములోనే ముద్రింపించితిని ఇంతలో నన్ను ప్రోత్సాహపఱుచుచునిర్బంధపఱచుచువచ్చిన వారిలో ముఖ్యులయిన నామిత్రులు సీ. వై. చింతామణిశాస్త్రి గారు చెన్నపురిని విడుచుట తటస్థించినందున వారిపోకతోనే నేనును నాపూనిన పనినప్పటికి విడిచితిని. అయినను ముద్రితమయిన పుస్తకభాగమును నామిత్రులనేకులు చూచుట తటస్థించెను. వారు గ్రంథమును ముగింపవలసినదని పలుమాఱు నన్ను కోరుచువచ్చిరికాని యప్పటికాలాగుననేయని వారితో చెప్పి తప్పించుకొనుచు వచ్చినను పనికిమాత్రము పూనక స్వాభావిక మాంద్యముచేత నశ్రద్ధచేయుచు వచ్చితిని. ఇట్లుం