పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

23

డెప్పుడైన నుపాధ్యాయుఁడు మొదటనే నన్న ప్పగింపు మనినయెడల నేను వెంటనే పుస్తకము చేతఁబుచ్చుకొని దిగువకుఁ బోయి చదివి యైదునిమిషములలోపలఁ దప్పులులేక యొప్పగింపఁ గలిగెడివాఁడను.

ఈకాలములో నాకుఁ బురాణములు చదువుపిచ్చి యంతకంతకు ముదురఁ జొచ్చినది. విశ్వామిత్రుఁడు బ్రహ్మసృష్టికిఁ బ్రతిసృష్టి చేసినట్టును, అగస్త్యుఁడు సముద్ర మాపోశనము గొన్నట్టును, కపిలుఁడు దృష్టిమాత్రన సగరపుత్రుల నఱువదివేవుర భస్మరాసులఁ జేసినట్టును, తపోమహత్త్వములనుగూర్చి చదువుచున్న ప్పు డెల్లను, నాకుఁ జిత్తోద్రేకము గలిగి నే నెప్పుడు తపస్సునకుఁ బూనుదునా యెప్పు డామహిమలను మించినమహిమలను బొందుదునా యని తహతహపడుచుందును. చెట్టు లేని దేశములో నాముదపుచెట్టే మహావృక్షమనఁ బరఁగినట్టు మూఢులయిన నా యీడుబాలురలో నేనేమో తెలిసినవాఁడ నయినట్టు పరిగణింపఁబడుచుంటిని. అందుచేత నావెఱ్ఱియూహలఁ గొన్నిటి నితరబాలురతలలకుసహిత మెక్కింపఁ గలిగితిని. పిన్న లలోను పెద్దలలోనుగూడ నేవెఱ్ఱికిఁ దగిన యావెఱ్ఱివా రేకాలమునందును నుండక మానరు. ఈతపోవర్ణన లన్నియు దివాస్వప్నము లనుకోక సత్యములని నమ్మి నేను భ్రమపడి యితరులను నాభ్రమలోఁ బడవేయఁ దొడఁగితిని. నాభ్రమలో ననాయాసముగాఁ బడినవారు నాసహపాఠులయిన రాచర్ల వెంకటరామయ్య గారును కనపర్తి లక్ష్మయ్యగారును హోతా వీరభద్రయ్యగారును. వారు ముగ్గురును వయస్సుచేత నాకంటెఁ బెద్దవారు. తపోమహిమయొక్క ప్రాశస్త్యమును వారికి బోధించి, హిమవత్పర్వతముమీఁదఁ దపస్సు చేయునట్లు పథక మేర్పఱిచి, వారిని ముగ్గురిని బ్రయాణము చేసితిని. వీరిలోఁ గడపటి యతఁడు హిమగిరియందలి సంజీవనౌషధములను సువర్ణకరణమూలికలను సహితము సంపాదింపవలయునని యుపదేశించెను. మానసక్షేత్రములయందు నేను నాటిన భ్రాంతిభీజము లంకురించి తీఁగలు సాగి యల్లుకొని తలకెక్కి వెఱ్ఱులను జేయఁగా, వా రల్పకాలములోనే యుత్సాహమునందు నన్ను మించినవారయి