పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

21

రెండవ ప్రకరణము - విద్యార్థిదశ.

క్రీస్తుశకము 1860 మొదలుకొని 1870 వ సంవత్సరమువఱకు.

వేసవికాలపుసెలవు లయినతరువాత రెండవ యర్థసంవత్సరమునందే పాఠశాలలో నేను బ్రవేశించినను సంవత్సరాంతమునఁ బరీక్ష జరగునప్పటికి తోడి బాలుర నందఱిని మించి చక్కఁగా బరీక్షయందుఁ దేఱి మాతరగతిలో మొదటిబహుమానమును బొందితిని. ఆసంవత్సర మాకస్మికముగా మాపాఠశాలామందిరము పరశురామప్రీతి యయిపోయినందున నాయగ్రబహుమాన పుస్తకముసహిత మగ్ని హోత్రునికే యర్పిత మయిపోయినది. అప్పటినుండి కడవఱకును పాఠశాలలో నేను బహుమతి పొందనితరగతి లేదు. పాఠశాల కాలిపోయినతరువాత నూతనభవనము నిర్మింపఁబడువఱకును గొంతకాలము పాఠశాల చిత్రవస్తుప్రదర్శనశాలలోఁ బెట్టఁబడినది. అక్కడ నేను రెండవ తరగతిలోఁ జదువఁ జొచ్చితిని. అప్పటికే నాకుఁ దెలుఁగుపుస్తకములయందభిలాషము హెచ్చినది. అందుచేతఁ బాఠశాలకుఁ బోయియుండిన కాలమునందుఁ దప్ప మిగిలిన కాలమునం దంతటను మాయింటఁ గల తాటాకుపుస్తకములనే చదువుచుండసాఁగితిని. ఇట్లు తాటాకులపుస్తకములను మరఁగి యింగ్లీషు పుస్తకముల నుపేక్షించుచుండుటచూచి పెక్కుతడవలు నాతల్లియు ముత్తవతల్లియు నన్ను నయమున భయమున మందలించి కార్యముగానక మాయింటికి సమీపమునందే వాసము చేయుచుండిన కానుకొలను రామచంద్రుఁడుగారను పేరుగల మా యుపాధ్యాయునియొద్దకుఁ బోయి నే నింట నింగ్లీషుపుస్తకములను ముట్టుచుండుటయే లేదనియు నన్ను శిక్షింపవలసినదనియు నొకనాఁ డాయనను వేఁడుకొనిరి. నే నింగ్లీషుపాఠ మొప్పగింపనిదిన మొక్కటియు లేదనియు, నేను నాతరగతిలోఁ బ్రతిపాఠమునందును మొదటివాఁడను గానో రెండవవాఁడను గానో యుందు ననియు, చక్కఁగాఁ జదువుచు నల్లరి