పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

స్వీయ చరిత్రము.

నాకు బుద్ధి పుట్టు చుండును. భారతములో నాకత్యంతప్రియము లగు భాగములు విరాటపర్వములోని యుత్తరగోగ్రహణమును భీష్మద్రోణకర్ణ శల్య పర్వములును. శ్రీమద్భాగవతములోని సప్తమస్కంధమును దశమస్కంధమును నాకుఁ బ్రియతమము లయినవి. మా పెదతండ్రిగారికి మునసబుకోర్టులో స్థిరమయినపనియయి యాయన గ్రామాంతరములయం దుండుచు వచ్చుటచేత నింట నొంటిగా నున్న నా కీగ్రంధపఠనాదుల కవకాశము కలిగినది. కాఁబట్టి నే నింగ్లీ షారంభించుటకుముందే నాకు ఛాందసవృత్తి బలియ నారంభించినది. నేను భక్తుఁడ నగుచున్నాఁడనని సంతోషించి నాతల్లి మొదలయినవారు నన్ను నిష్ఠాపరత్వమునుండి మరల్పఁ జూడక ప్రోత్సాహపఱుచుచు వచ్చిరి. ఎవ్వనికైన నొకవిషయమున నొకన్యూనత యున్న పక్షమున నింకొకవిషయమున నాధిక్యమును గలిగించి యీశ్వరుఁ డాలోపమును పూరించునని విద్వాంసులు చెప్పుదురు. ఈసత్యమును నాదృష్టాంతముచేఁ గొంతవఱకు స్థాపింపవచ్చును. ఆకాలమునందు నాకు దేహబల మెంత తక్కువగా నుండెనో బుద్ధిబల మంత యెక్కువగా నుండెనని చెప్పవచ్చును. నా కాపిన్న వయస్సునఁ గల గ్రహణ ధారణశక్తులసాధారణము లయినవి. అయినను నాకు వానివలన విశేషలాభము కలుగుటకు మాఱు గాఁ గొంతవఱకు నష్టియే కలిగినదని చెప్పవచ్చును.