పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

స్వీయ చరిత్రము.



బములకు తగియుండునని నేను చెప్పియుంటిని. దానిలో నొక భాగమీయన కిచ్చెదననియు, రెండవభాగము నెవరైన వేఱొక వితంతువివాహ దంపతుల కుపయోగపడునట్లు చేసెదననియు, ఈవివాహ దంపతుల నిమిత్తము దొడ్డిలో నేను కట్టెదను లేక యిండ్లు కట్టఁబడుననియు, నేనీయనకు చెప్పితిని. అందుచేత ఈభాగము నీయనకిచ్చుటకు నేనిప్పుడిష్టపడుచున్నాను. ముందును ఇష్టపడియెదను కాని యిల్లంతయు నేనీయనకియ్యజాలను. ఈయన కది యిష్టము లేనిపక్షమున, మీరు రు. 300 లిచ్చుటకు వాగ్దానముచేసినట్టు చెప్పుచున్నారు గనుక, ఆసొమ్ము నేనీయనకిచ్చెదను; ఆయన వేఱేయిల్లు కొనుక్కోవచ్చును. మామూలు షరతులతో ననఁగా - తాకట్టు పెట్టుకొనుటకుఁగాని అమ్ముకొనుటకుఁగాని హక్కు లేకుండ కుటుంబనిమిత్తమే యుపయోగ పడునట్లు - ఈయన సరిగా యిల్లు కొన్నప్పుడు మాత్రమే మనమీసొమ్మీయన కియ్యవలెను. మనము మిక్కిలి యెక్కువ యుపకారముచేసి యున్నా మనియు, ఈశ్వరానుగ్రహమువలన ఈయన ప్రతివిధముచేతను ఇతరులందఱికంటెను మంచిస్థితిలో నున్నాఁడనియు, మీరిప్పుడు చూతురని నేను కోరుచున్నాను. ఇప్పటిదానితో ఈయన తృప్తినొంది యుండవలెననియు, సంతుష్టి ధర్మములతో సమాధానపడవలెననియు, ప్రతివిధముచేతను వాగ్దానములన్నియు నెఱవేర్పఁబడినవనియు, వాగ్దానములకంటె నధికముగా నీతనికి చేయఁబడెననియు మన మిచ్చెదమన్న యింటిభాగమును పుచ్చుకొనుట కిష్టములేక వేఱుగా నొక యిల్లు కొనెడు పక్షమున నేను పైని చెప్పినట్లుగా నింటికొఱకు రు. 300 రూపాయలు తప్ప సొమ్ముగాని యిల్లుగాని మీరియ్యవలసిన పనిలేదనియు, దయచేసి మీరీయనతో చెప్పుఁడు. మనచేతనైనదంతయు చేసియున్నాము, మనచేత దానికంటె నెక్కువగా నీయనకు చేయఁబడినది. వారిక్కడకువచ్చి చెన్న పట్టణమునకును ఇతర స్థలములకును పోవునప్పుడుగాని యితర స్థలముల నుండి దీనిగుండపోవుట కిచ్చటికి వచ్చునప్పుడుగాని సామాజికుల కిక్కడ వేఱుగృహములు లభ్యములుకావు గనుక ఈసంఘముయొక్క సామాజికులకు