పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

295



వసతిపడవలెను కోరికతో నే నీయింటి నెంతో యనుకూలముగా కట్టించి యున్నాను. అట్లయియుండఁగా, ఈ పెద్ద సొత్తు నొక్క కుటుంబమునకు మాత్రమే యిచ్చి నా పెద్ద కోరిక నెట్లు నేను బలిపెట్టఁగలను? ఈప్రకారముగా నేను వస్తువుల నిచ్చివేయఁజాలను."

ఈ యుత్తరము వచ్చువఱకును రామకృష్ణయ్య గారింత సొమ్మీయన నిమిత్తము వ్యయపెట్టిరని నాకు తెలియదు. ఇక్కడ రాజమహేంద్రవరములో నొక్కొక్క వరుని విషయమున నింతింతసొమ్ము వ్యయపెట్టుటకు సమాజము వారొయొద్ద ధనమునులేదు; ఉన్నను ధనమును విచ్చలవిడిగా వ్యయముచేయనుచేయరు. సమాజస్థాపనమయిన 1884 వ సంవత్సరమునం దిచ్చిన యిరువదిరూపాయలునుగాక, 1885 వ సంవత్సరమునందు సమాజమువారు కోదండరామయ్య గారికి భార్య నగల నిమిత్తము రు. 80-0-0లును, భార్య ప్రసవము నిమిత్తము రు. 10-0-0లును, ఏప్రిల్ మెయి నెలలకు నెల కాఱేసి రూపాయల చొప్పున రు. 12-0-0లును, సెలవుమీఁదనున్న ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలలకు నెలకు పదేసి రూపాయల చొప్పున రు. 40-0-0 లును మొత్తము నూటనలువదిరెండు రూపాయలు (రు. 142-0-0) సమాజము వారిచ్చిరి. ఈయన వివాహనిమిత్తము వ్యయపడిన రు. 454లలో రు. 110 ల పయి చిల్లరనగలుమాత్రమే యీయనభార్య కప్పుడు పెట్టఁబడినవి. ఇన్నూఱురూపాయల ప్రాప్తికి రావలసిన మిగత మొత్తము నగలనిమిత్త మియ్యఁబడినది గాని యీయన నగలు చేయించి పెట్టినట్టు కనఁబడదు. భార్య యొక్క ప్రసవము నిమిత్తముపోయి కాకినాడలోనుండిన కాలములో నచ్చటి వ్యయములను రామకృష్ణయ్యగారు భరించిరి. కోదండరామయ్యగా రీకాలములో నిరువదిరూపాయలు జీతముగల యుపాధ్యాయపదమునం దుండిరి. ఈవఱకు నేను జెప్పినట్లు కొంచెము వైరకారణము కలుగఁగానే నాకు విరోధులుగా నున్న పెద్దమనుష్యులు కొందఱు తమయొద్ద కాలోచనకు పోయిన యొకరిద్దఱు వరుల సాహాయ్యముతో తక్కినవరులను తమయొద్దకుఁ