పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

251



మునుజూపక యనుకూలురుగానే కనఁబడుచువచ్చిరి. మేము నరసాపురము బైలుదేఱి మధ్యాహ్న మొక యూరిసత్రముచేరునప్పటికి మాకంటె ముందుగా బండ్లుదిగి వంటచేసికొన్న బ్రాహ్మణకుటుంబమువారు మాచిన్న వాని నన్నము పెట్టుటకయి తీసికొనఁబోవవచ్చిరి. నేను మాస్థితిని దెలుపఁగోరి మేమెవ్వరమో యెఱుఁగుదురాయని యడిగితిని. "ఎఱిఁగియే పిలువవచ్చితిమి ; మేమును మీకంటె కొంచెము ముందుగా బైలుదేఱి నరసాపురమునుండియే వచ్చుచున్నాము" అని వారు బదులుచెప్పిరి. ఆరాత్రి మేము గొల్లపాలెము చేరఁగా పలువురు నన్ను చూడవచ్చుటయేకాక యొక పెండ్లివారు మమ్ము వంటచేసికోనియ్యక మాకు పిండివంటలతో సమస్త భోజనపదార్థములను బ్రాహ్మణులచేత పళ్లెములతోఁబంపిరి. త్రోవలో నెట్లుండినను బందరుపురము మేము చేరునప్పటికి నారాకయంతకుముందే తెలియుటచేత మహావాయువుచేత కలఁత నొందింపఁబడిన మహాసముద్రమువలె పౌరజనవారిధి యంతయు కలఁగి యల్లకల్లోలముగా నుండెను. తనపట్టణములో గతభర్తృకాపాణిగ్రహణమునకు తాను ప్రథముఁడనుగా నుండెదనని నాపేరవ్రాసిన బ్రాహ్మణధీరుఁ డాసంక్షోభమునకు సంత్రస్తుఁడయి బాలవితంతు పరిణయముమాట యటుండఁగా నేను వెదకుకొనుచు తమయింటికిఁబోయినప్పు డీవిషయమయి నాతో బహిరంగముగా మాటాడుటకే భయపడి నన్నొంటిగా చాటునకుఁ గొనిపోయి తానప్పుడు రోగపీడితుఁడయి యుండుటచేత వివాహప్రయత్న మప్పటికి విడిచితిననియు తాను స్వస్థపడి పునఃప్రయత్నము చేసినప్పుడు నాపేర వ్రాసెదననియుఁ జెప్పెను. నేనంతటితో నిరుత్సాహుఁడనయి యాశాభంగము చెందక పట్టణమునకు వచ్చినందుకు కొంత పనిచేసి పోవలెనని వివాహ విషయమునఁ గొన్ని యుపన్యాసముల నిచ్చుటకు నిశ్చయించితిని. నా మొదటి యుపన్యాసమును నేను బసచేసిన శ్రీవల్లూరు జమీందారుగారి విశాలసభాభవనమునందే చేసితిని. అది యచ్చటి నాప్రథమోపన్యాసమగుటచేత దానిని వినవలెనన్న కుతూహలముచేతను, నామొగ మెట్లుండునో చూడవలెనన్న యభిలాషచేతను.