పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

స్వీయ చరిత్రము.



మఱికొన్ని హేతువులచేతను, ఉపన్యాస సమయమునకు ముందే వందలకొలఁది జనులు వచ్చుటచేత సభాభవనమంతయు మనుష్యులతో క్రిక్కిఱిసిపోయినది. సభాపతులైన నిష్ఠల నరసయ్యగారు మొదలైన బ్రాహ్మణులలోని ప్రసిద్ధపురుషులు కొందఱు తమ శిష్యబృందముతోఁ గూడ వేంచేసి, నాయుపన్యాసమును సాగనీయక చప్పటలుగొట్టి యల్లరిచేయ నిశ్చయించుకొనివచ్చి యున్నారని నామిత్రులుకొందఱు నాకామహాపురుషులను జూపిరి. అటువంటి సభలో శాస్త్రప్రసంగమును చేయఁబూనుట యవివేకమనియెంచి నేనట్టిపనికి పూనక క్రొత్తగా నరసాపురములో నుపన్యసించి వచ్చుటచేత నందలియంశములనే విశేషముగాఁగొని నిర్బంధవైధవ్యమువలనఁ గలుగుచున్న వివిధానర్థములనుగూర్చియు తత్సాంకర్యనివారణ సాధనములనుగూర్చియు వారు కనియు వినియు నున్న దృష్టాంతములతో తలవంచుకొని నాస్వభావధోరణిని రెండు గంటలసే పుపన్యసించి వారి హృదయములకు తాఁకునట్లుగా ననన్యగతికలైన యనాధకాంతావనపుణ్యకార్యమునందు దీక్ష వహింపవలసినదని ప్రార్థించితిని. మొదట నూహించినట్లెవ్వరును నల్లరిచేయక యెల్లవారును కడవఱకును, నాయుపన్యాసమును నిశ్శబ్దముగా వినిరి. జనసమ్మర్దముచేతను, ఆతప తాపముచేతను, నాదేహమంతయు చెమర్చి యాయాసము కలుగఁగా క్రొత్తగాలిలో తిరిగి బడలిక తీర్చుకొనుటకయి నేను మేడమీఁదికెక్కి వీధివైపున పచారు చేయుచుంటిని. అల్లరిచేయఁ దలఁచుకొనివచ్చి నారాన్న బ్రహ్మణోత్తములు తమలో తామావిషయమయియే మాటాడుకొనుచు నడచిపోవుచు నాకంటఁబడిరి. వారిలోనొకరు లోపలినుండి వీధిలోనికి మెట్లు దిగుచు "ఈ యుపన్యాస మెట్లున్నదిరా ?" అని రెండవవారినడిగెను. "ఇటువంటిపాడు సభలకు మనము రాకూడదు. ఇటువంటిమాటలు వినుచు వచ్చినయెడల మన బుద్ధికూడ చెడిపోవును" అని యాయన బదులుచెప్పెను. నాఁడు భగవదనుగ్రహమువలన పామరులవలని పరాభవమునుండి తప్పించుకొని బయలఁబడఁ గాంచితిని.