పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

స్వీయ చరిత్రము.



యొక్క సాహాయ్యమక్కఱలేకయే దంపతులను రాత్రివేళ వీధులగుండ నిర్భయముగా నూరేగింపఁగలిగిన కాలమువచ్చినది.

ఈ ప్రకారముగా నెలకును రెండేసి నెలలకును రాజమహేంద్రవరములో వెంబడి వెంబడిగా వివాహములు జరుగుచుండుటచూచి, చెన్న పురములోనిమిత్రులు పళ్లె చెంచలరావు పంతులుగారును దివాన్ బహుదూరు రఘునాధరావుగారును వివాహము లెల్ల రాజధానిలో నొకమూల నున్న రాజమహేంద్రవరములో జరగుటకంటె కొన్నియైనను రాజధానిలోనే జరగుట యధికాభ్యర్థనీయమగుటచేత నొకటి రెండు వివాహములను చెన్న పట్టణములో జరప వలసినదని నన్నును రామకృష్ణయ్యగారిని కోరిరి. నేను వారి యాజ్ఞను శిరసావహించి వారి యభీష్టమును చెల్లించుటకు కృతనిశ్చయుఁడనై సాధ్యమైనయెడల నొక రిద్దఱు వధూవరులను సమకూర్చి చెన్న పట్టణములో వివాహము చేయుటకు ప్రయత్నించెదనని వారిపేర వ్రాసితిని. రాజమహేంద్రవరములోని బ్రాహ్మణవిద్యార్థి యొకఁడు క్రొత్తగా పెండ్లి చేసికొని కాలధర్మము నొందెను. అతని యప్పగారు మాయింటి సమీపముననే కాపురముండి, యప్పుడప్పుడు మాయింటికి వచ్చుచుండెను. ఆమె నొకసారి మీ తమ్మునిభార్య యెక్కడనున్నదని యడుగఁగా గుంటూరు మండలములోని యొకపల్లె యందున్నదని చెప్పి, తనమఱదలుమాత్రమే కాక మఱదలి చెల్లెలు సహితము విధవయయ్యెనని చెప్పెను. వారికి వివాహము చేయింపరాదాయని నేనడుగఁగా తనకు ప్రయాణవ్యయములను కొంత బహుమానమును ఇచ్చెడు పక్షమున పిల్లల తల్లితో మాటాడి యామె నిచ్చటికి తీసికొనివచ్చెదనని చెప్పెను. నేనందున కంగీకరించి దారిబత్తెమున కియ్యఁగా నామె నాతో చెప్పినట్టు తల్లిని గొనివచ్చెను. తల్లితో మాటాడి యామె యంగీకారమును బడసి యామెను మరల గుంటూరు సమీపముననున్న వల్లూరికి పంపి యిద్దఱు వితంతు కన్యలను బిలిపించితిని. రెండుసారులు వెళ్లినందుకును తల్లి వారిని వెంటఁబెట్టుకొనివచ్చి నందుకును నలువది రూపాయలయినవి. వితంతువులను