పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

237



తీసికొనివచ్చుటకయి ప్రయాసపడిన యామెకు దారిబత్తెముతోడ కూడ నలువది రూపాయలనిచ్చితిని. తణుకు చలపతిరావను నతఁడొకఁడును, బేతపూడి ప్రకాశరావను నతఁడొకఁడును ఇద్దఱు వరులావఱకే మాయింటనుండిరి. ఈ బాలవితంతువులలో పెద్ద చిన్న దాని వయస్సు పండ్రెండేండ్లు ; ఆమెచెల్లెలి వయస్సు పదేండ్లు. ఈ వధువుల నిద్దఱిని నాయొద్దనున్న వరులకిచ్చి చెన్న పట్టణములో వివాహముచేయ నిశ్చయించి అక్కడి మామిత్రద్వయమునకు నీశుభవార్తను దెలిపి, యిద్దఱు వరులు వధువులు పురోహితుఁడు వంటబ్రాహ్మణుఁడు మొదలైనవారిని వెంటఁబెట్టుకొని భార్యా సహితముగా పొగయోడ నెక్కుటకు నేను కాకినాడకు వెళ్లితిని. రఘునాధరావుగా రావఱకే తమ స్వశాఖవారు వంటచేసినఁగాని తాను భోజనముచేయనని నా పేరవ్రాసిరి. అందుచేత వంటచేయుటకయి నేను కాకినాడలో నున్న మాధ్వదంపతులను గూడఁ బ్రయాణముచేసితిని. నాయుత్తరమందఁగానే చెంచలరావు పంతులుగారు రఘునాథరావుగారియుత్తర మందు వఱకును రావలదని కాకినాడకు తంత్రీవార్తను బంపిరి. అందుచేత మేము నాటి పొగయోడను విడిచిపెట్టి వారము దినములు కాకినాడలో నిలువవలసి వచ్చినది. రఘునాథరావుగారి యొద్దినుండి వచ్చిన యుత్తరమిది. -

"మైలాపురము, 28 వ మెయి 1883. నాప్రియమైన అయ్యా !

మీ యుత్తరములందిన మీఁదట సమాజ సభ్యులయొక్క విశేషసభను మేము సమకూర్చితిమి. సభకువచ్చిన 30 సభ్యులలో 18 బ్రాహ్మణులుగా నుండిరి. వారందఱును వివాహమునకువచ్చి తాంబూలములు పుచ్చుకొనుట కిష్టముగా నున్నారు. భోజన విషయమయి నిశ్చయముగా శూద్రసభ్యుల కాక్షేపణ లేదు గాని, అది మనకంత యుపయోగముకాదు. బ్రాహ్మణ సభ్యులలో నెఱవేర్ప సులభముగాని షరతులమీఁద తప్ప భోజనముచేయుట కిష్టులుగా నున్న వా రత్యల్పసంఖ్యాకులు. ఈసంగతులనుబట్టి మద్రాసులో వివా