పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

స్వీయ చరిత్రము.

ఈదంపతులే నాకు జననీజనకులు. ఆకాలమునం దెల్లవారికిని దయ్యముల యందలివిశ్వాస మత్యధికము. స్త్రీలలో నొకప్పుడును దయ్యముపట్టనివారెక్కడనో కాని లేకయుండిరి. ఎవ్వరికేవ్యాధి వచ్చినను వైద్యునియింటికిమాఱుగా ముందుగా భూతవైద్యుని యింటికో సోదెచెప్పువాని యింటికో పరుగెత్తు చుండిరి. ఏయింట నేపురుషుఁడు మరణము నొందినను, ఏతరుణి మరణము నొందినను, దయ్యమయి తిరుగుచుండు నని స్త్రీ పురుషసామాన్యముగా నెల్ల వారును నమ్ముచుండిరి. అందులోను మాతల్లి దయ్య మావహించి పీడించుచున్నదని భ్రాంతి నొంది నిద్రాహారములు సరిగా లేక శుష్కించి బాధపడుచుండెనఁట! మాతాతగా రెంద ఱెందఱనో భూతవైద్యులను మంత్రశాస్త్రవేత్తలను రప్పించి చికిత్స లెన్ని చేయించినను మారణహోమము లెన్ని చేయించినను ప్రాఁత భూతము విడువఁగానే క్రొత్తభూత మొకటి యా వేశించుచు వచ్చుటచేత నామె కృశించుచునే యుండెను గాని భూతము లామె నెప్పుడును బూర్ణముగా విడిచిపోలేదఁట! ఇటువంటి దుర్బలయువతిగర్భమున జనించినవాఁడ నగుటచేత శిశుదశలోసహితము నేను దుర్బలుఁడనుగానే యుంటినఁట! అట్టి నాస్వాభావిక దేహదౌర్బల్యమునకుఁ దోడు పురిటిలోనే దగ్గొకటి పట్టుకొని యప్పటినుండి యిప్పటివఱకును నన్ను విడువక బాధించుచున్నది. పురిటి దినములలోఁ దాను జేసిన యపథ్యదోషము నాదగ్గునకుఁ గారణమని నాతల్లి నాతో నెన్ని యోసారులు చెప్పి నేను కాసబాధచేశ్రమపడుచున్న ప్పుడు నన్నుఁగూర్చి పరితపించుచుండెను. ఈ దగ్గిట్లుండఁగా నాఱు నెలలప్రాయమప్పుడు నాకు స్ఫోటకము వచ్చినది. ఏఁబదిసంవత్సరములకు మునుపు వచ్చిన పోటకపుమచ్చలు కొన్ని యిప్పటికిని స్పష్టముగా నాముఖముమీఁదఁ గనఁబడుచున్నవి. అప్పు 'డాపా టెంత యుగ్రమయినదిగా నుండెనో చెప్ప నక్కఱలేకయే దీనినిబట్టి యెల్లవారికిని విశదము కావచ్చును. అప్పు డెల్ల వారును నాజీవితముదెస నిరాశ చేసికొనిరఁట! కన్నులు మూఁతపడఁగా నొక