పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

13

దినమెల్ల నేను కాలుచేయిసహిత మాడింపక నిర్జీవప్రతిమవలె నుంటినఁట! చచ్చితి ననుకొన్న నే నెట్లు మరల బ్రతుకఁ గలిగితినో తనకే యాశ్చర్యము కలిగించెనని పలుకుచు నాజనని తా నప్పుడు నానిమిత్తమయి పడినమనోవేదనయు మ్రొక్కుకొన్న మ్రొక్కులును మసూరిరోగము వచ్చినవారిని గూర్చిన ప్రసంగము వచ్చినప్పుడు తోడివారితోఁ జెప్పి నన్ను వారికిఁ జూపుచు వచ్చెను. ఇటువంటి పనికిమాలిన దుర్బలమానవునిచేతఁ గూడ గొంతపని చేయింపవచ్చునని చూపుటకుఁ గాఁబోలును బరమకృపాళుఁ డైనపరమేశ్వరుఁ డామెప్రార్థనల నాలకించి నన్ను భూమిమీఁద నిలుప ననుగ్రహించెను. నాలుగైదుసంవత్సరములప్రాయము వచ్చువఱకును నన్నుఁగూర్చి చెప్పుకో వలసిన దేదియు నాకు స్ఫురణకు రాలేదు. అన్న మెంతయెక్కువగాఁ దిన్న నంతబలియుదురన్న నమ్మకము కలదయి యజ్ఞానముచేత నాప్రియమాత నన్ను శీఘ్రముగా బలిపింపవలెనన్న యుత్కంఠతోను సచ్చింతతోను నాకన్న మెక్కువగాఁ బెట్టి నోటిలోనిముద్దను మ్రింగకున్న ప్పుడు మిరెపుకాయలగుండ నానాలుకకు రాచుచుండుటయు నోటిలోనిముద్ద మ్రింగి కారముచే నే నేడ్చినప్పుడు నెత్తిమీఁద మొట్టుచుండుటయు నెందుచేతనోకాని నేఁడు జరిగినట్టుగా నామనస్సున దృఢముగా నాటుకొని యిప్పటికిని మఱపునకు రాకున్నవి. బిడ్డలయందలి యతిప్రేమచేతఁ దల్లు లెప్పుడు నిట్టియవివేక కార్యములను జేయకుండుదురు గాక!

నాకు నాలుగేండ్లప్రాయమప్పుడు మాతండ్రిగా రపాయస్థలమునందు కురుపువేసి కాకినాడలో పరమపదించుట సంభవించినది. అప్పుడు నాకు మరణ మనఁగా నేమో తెలియదు. మాతండ్రిగారి శవమును గాని శవమును ప్రేతభూమికిఁ గొనిపోవుటగాని నన్ను చూడనియ్యక స్మశానవాటిక నుండి మా పెదతండ్రిగారు మఱల వచ్చువఱకును మావారు నన్ను మఱియొకరియింటికిఁ బంపి వేసిరి. నే నింటికి వచ్చినప్పుడు నన్నుఁజూచి మాయింట నున్నవా