పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

స్వీయ చరిత్రము.



యిల్లెప్పుడుచూచి బంధుమిత్రాదులతో నెప్పుడు సల్లాపసౌఖ్యము ననుభవింపఁగలుగుదునాయను నాత్రముతోనుండియు, ఆవఱకు రెండుదినములనుండి భోజనములేక క్షుధార్తుఁడై యుండియు, నామాటకు మాఱుపలకక తాను తెచ్చినవస్తువులను నాకప్పగించి, మరల పడవనెక్కి యోడదగ్గఱ కైదు మైళ్లు సముద్రముమీఁదపోయి వచ్చినయోడలోనే విశాఖపట్టణమున కాయన వెళ్లెను. పరార్థమయి స్వసుఖత్యాగమిట్లుగదా చేయవలయును ! విశాఘపట్టణముచేరి దంపతులను సమాధాన పఱుచుటకయి తా మక్కడనుండి యెప్పటి సమాచారములప్పుడు నాకు తెలుపుచుండిరి.

ఇచ్చట పెండ్లికొమారుఁడు మామీఁద వచ్చియున్న వ్యవహారము యొక్క పర్యవసానము తేలువఱకును వివాహమును నిలుపవలసినదని నన్ను కోరుచుండెను. అంతట వరునియొక్క యన్న గారు రాజమహేంద్రవరము వచ్చి మంచిమాటలచేత నాతనిని తీసికొని పోవలెనని యెన్నో యుపాయములు చేసెనుగాని నాముందఱ నాతనియుపాయములు సఫలములయినవికావు. అటుతరువాత వివాహమగు వఱకును మరల పాఱిపోకుండ పెండ్లికుమారునిని కంటికి ఱెప్పవలె నొకరు విడిచి యొకరముకాచి, 1882 వ సంవత్సరము అక్టోబరునెల 22 వ తేదిని బహు కష్టముమీఁద మూడవ వితంతు వివాహమునుచేసి యీశ్వరానుగ్రహముచేత నిర్వహింపఁగలిగితిమి. ఈ వివాహమునకు మాకు మొదటి వివాహమునకంటెను పదిరెట్లు ప్రయాస మెక్కువయయినది. మొదటివలెనే యిప్పుడును రక్షకభటులు మాయిల్లు కావలికావవలసివచ్చెను. విశేషవ్యయముచేసి యా వివాహమును మొదటి దానికంటెను నధికవైభవముతో జరపితిమి. అంతధనవ్యయముచేసినను, ఇంతమంది రక్షక భటులు కావలికాచినను, ఊరేగింపు ఉత్సవసమయమునం దాయుథపాణులయి యా రక్షక భటులు పల్లకిచుట్టును నిండియున్నను దుష్టులు కొందఱు పెండ్లిపల్లకిమీఁద రాళ్లువిసరిరి. పిమ్మట మాప్రతిపక్షులు తెచ్చిన యభియోగము విమర్శమీఁద డిసెంబరునెలలో కొట్టుపడిపోయినది. విమర్శసమయమునందు పెండ్లి