పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

223



చిన్న దానిని తనతోడఁ దీసికొనిపోవ సిద్ధముగా నున్నదనియు, ఆపుటకయి వెంటనే సాధనము లాలోచింపవలసినదనియు, పెద్దాపురపువధువును తీసికొని వచ్చుటకయి మేము చేసిన కృషి విఫలమయిన కాలములో విశాఖపట్టణములోని మిత్రులయొద్దనుండి నాకుత్తరములును తంత్రీవార్తలును వచ్చినవి. వరుఁడు మొదటినుండియు పట్టణములోనుండి నాచేత శిక్షితుఁడయి యింగ్లీషు విద్యాభ్యాసముచేసిన నవనాగరికుఁడు ; వధువు మొదటినుండియు పల్లెలలో గ్రామ్యజనులలో నుండి విద్యాగంధములేక మోటుదేశములో పెరిగిన మృగప్రాయురాలు. ఇట్టి యీయుభయులకును ప్రతివిషయములోను భిన్నాభిప్రాయము కలిగి యైకమత్యము లేకపోవుచుండఁగా నింతలో తల్లి కూతురివద్దకువెళ్లి యామెపక్షమయి యల్లునిఁ దమకు దాసునిగాఁ జేసికొనవలెనని వివాదము లాడుటచేత తగవు లంతకంతకు హెచ్చి కాపురము చెడిపోవునంతటి దుస్థ్సితికివచ్చెను. విద్యాధికుఁడైన వరునకిచ్చి వివాహముచేయుటవలన నీప్రథమ దంపతు లెంతో సుఖవంతులగుదురని నేను భావించితిని. తానొకటి తలఁచినదైవమొకటి తలఁచును. నేను మొట్టమొదటనే యీచిన్న దానిని వివాహమునిమిత్తమయి నావద్దకువచ్చు చుండిన యొక మోటు వానికిచ్చి వివాహము చేసియుండినపక్షమున, ఆదాంపత్యము నిజముగానే సుఖవంతమయి యుండి యుండును. విశాఘపట్టణమునుండి తంత్రీవార్తలు వచ్చిన సమయమునందే చెన్న పట్టణమునుండి తాము బైలు బైలుదేఱుచున్నామని గవర్రాజుగారు నాకు తంత్రీవార్తను బంపిరి. నేను వెంటనే కాకినాడకుఁబోయి యాయనయోడ దిగెడు దినమున వంతెనవద్ద వేచియుంటిని. ఆదినమున పొగయోడ కాకినాడ చేరుటకు మిక్కిలి యాలస్యమయినది. మధ్యాహ్నము రెండుగంటల కాయన యోడదిగి పడవలో తీరముచేరునప్పటికి, నేనొడ్డుననుండి యాయనను కలిసికొని విశాఖపట్టణమునుండి వచ్చిన లేఖలను తంత్రీవార్తలనుజూపి శ్రీరాములుగారికిని భార్యకును పొందుపఱుచుటకయి విశాఖపట్టణము వెళ్లవలసి యున్నదని చెప్పితిని. చిరకాలము భార్య మొదలయినవారిని విడిచియుండి