పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

స్వీయ చరిత్రము.

దుకూరుపురనివాసులయి యుండినట్టును, అటుతరువాత మహమ్మదీయుల కాలములో నుద్యోగధర్మమునుబట్టి యేలూరునకు వచ్చినట్టును, దెలియవచ్చుచున్నది. మహమ్మదీయప్రభుత్వముయొక్క క్షీణదశతోనే మాపూర్వులయధికారప్రాబల్యము సహితము క్షీణించినది. తరువాతఁ బ్రభుత్వమునకు వచ్చిన యింగ్లీషుదొరతనమువారు మహమ్మదీయుల కాలములో సంపాదించి మా పూర్వులనుభవించుచుండిన చిన్న జాగీరులను గైకొనివారికిఁ గొన్ని తరములవఱకును నుపకారవేతనముల నిచ్చుచు వచ్చిరి. ఇట్లుపకారవేతనము లనుభవించిన వారిలోని కడపటియతఁడు నేను పెద్దవాఁడ నయినతరువాతనే కాలధర్మము నొందెను. మావారిలోఁ గొందఱిప్పటికిని గొన్ని గ్రామములను గలవారయి యున్నారుగాని యప్పులపాలయి యుండుటచేత వారి ప్రస్తుతస్థితి యంత బాగుండలేదు. మా సన్నిహితజ్ఞాతు లింకొకరు గంజాముమండలములో సంస్థానాధిపతులుగ నున్నారుగాని యా సంస్థానము వంశపరంపరాగత మయినది గాక యిటీవల సంపాదింపఁబడిన దని వినుచున్నాను.

ఆకాలమునందు కాలువలయాధారము లేనందున మాన్యక్షేత్రములు వాన లనుకూలముగా కురిసినసంవత్సరము పండవలసినవిగాను, కురియని సంవత్సర మెండవలసినవిగాను, ఉండెను. ఆకాలమునందు భూములపైని దొరతనము వారికిఁ గట్టవలసిన పన్నులు చెల్లుటయే దుర్ఘటముగా నుండుచు వచ్చెను. అందుచేత భూములయాదాయమును నమ్ముకొని స్వస్థలమునందే యుండుట కవకాశము లేక మాతాతగారు రాజాశ్రయమును బొంది స్వగ్రామమును విడిచి రాజమహేంద్రవరమునకు వచ్చి కొంతకాలమున కక్కడ మిక్కిలి ప్రబలులయి విశేషధనార్జనము చేసి రాజభవన మనఁదగినంత మహాసౌధమును గట్టి యచ్చటనే స్థిరనివాస మేర్పఱుచుకొనిరి. ఆయిల్లు వ్యాపించినంత మేరలో దాని కెదుటి శ్రేణిలో నుత్తరదిక్కున నాఱిండ్లును దూర్పువైపున నైదిండ్లును గలిగియుండుట తద్గృహవైశాల్యాధిక్యమును దెలుపును. ఆయిల్లేఁబండ్రు సుఖ