పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

7

కొని వివాహకార్యములు నడపునప్పుడు వివాహితలలో లక్షలకొలఁది బాలవితంతువులేల కావలెను? అట్టిచోట్ల నెల్ల జాతకబల మేమగును? ముహూర్తబల మేమగును? జ్యోతిశ్శాస్త్రవిశ్వాసము లేని పశ్చిమఖండ వాసులలోని వివాహములకంటె జ్యోతిశ్శాస్త్రమర్యాద నతిక్రమింపక చేయఁబడు మనలోని వివాహము లేవిషయమున నధిక సుఖప్రదములుగా నున్నవి? జన్మపత్రములలో వ్రాయఁబడిన ఫలములలోఁ గొన్ని కాకతాళీయములుగాఁ గలుగుట తటస్థించినను, గొన్ని యైనను దప్పిపోవుచుండుటచేత నట్టిశాస్త్రము విశ్వాస యోగ్యమైనది కాదని నాదృఢనిశ్చయము.

పూర్వోదాహృతమయిన మత్పితామహుని నామధేయమునుబట్టియు నా పేరునుబట్టియు మాపూర్వులు శైవులైన ట్టూహింపఁ దగియున్నదిగదా? అస్మత్ప్రపితామహునివఱకును మాపూర్వులందఱు లింగధారులయి వీరశైవులయియే యుండిరి. కేవలవీరశైవులగుటయేకాక మాపూర్వులలోని శైవమతోన్మాదు లయినవారు కొంద ఱధికారప్రాబల్యమునుబట్టి స్మార్తుల కనేకులకు బలవంతముగా లింగములు గట్టి వారిని శైవమతప్రవిష్టులనుజేసిరి. మాపూర్వులు శైవబ్రాహ్మణులలోని యాఱువేల నియోగిశాఖలోఁ జేరినవారు. అందుచేత వారు స్మార్తు లయిననియోగులతో సంబంధబాంధవ్యములను జేసికొనుచుండిరి. నాముత్తాతగారయిన చంద్రమౌళిగారికి స్మార్తులలోని శ్రీచూర్ణధారుల (నిలువుబొట్టువారి) కన్య నిచ్చుట తటస్థమైనది. ఆదంపతుల కుదయించిన మత్పితామహులగు వీరేశలింగముగారు వైష్ణవమతాభిమాను లైన మేనమామల ప్రోత్సాహముచేతనో మఱి యే హేతువుచేతనో తాము లింగధారణమును మానివేసి సంస్కారమునకు మొదట దారి తీసిరి. పితామహాగత మగుటచేతఁ గాఁబోలును వారిపేరింటివాఁడ నగు నాకును బాల్యమునుండియుఁ దత్సంస్కారవాసన యించుక సోఁకినది. మాతాతగారి జన్మభూమి యేలూరు. అక్కడనే వారికిఁ బూర్వార్జితము లయినభూములును గృహములును నుండెను. మాయింటిపేరునుబట్టి మాపూర్వు లాదియందు నెల్లూరుమండలములోని కం