పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

స్వీయ చరిత్రము.



విద్యార్థులపాఠశాలయొక్కటియే యిప్పటికిని నిలిచి నగరపారిశుద్ధ్యవిచారణ సంఘమువారి పరిపాలనము లోనున్నది. తమమరణమువఱకును బసవరాజు గవర్రాజుగా రారాత్రిపాఠశాలకు కార్యనిర్వహకులుగా నుండి యెంతో శ్రద్ధతోఁ బని చేయుచుండెడివారు. నేనును నామిత్రులును విద్యార్థుల నిట్టి సత్కార్యములకు పురికొల్పి ప్రోత్సాహపఱుచు చుండెడివారము. రబ్బాప్రగడ పాపయ్యగారు, పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలైన విద్యార్థులు ప్రార్థనసమాజ కార్యములలోను శ్రద్ధాభక్తులు కనఁబఱచి బీదలకన్న దానము చేయుట మొదలగు సమస్తసత్కార్యములలోను మిక్కిలి శ్రమపడుచుండెడి వారు. ఆస్తికపాఠశాలనుబట్టి ప్రార్థనాసమాజము రెండుశాఖలయినదిగాని యాక్రొత్తశాఖ యప్పుడే యంతరించి మాసమాజముమాత్రమే నేటికిని నిలిచి యున్నది. ఆస్తికపాఠశాల స్థాపింపఁ బడినయుద్దేశ మటుతరువాత సహిత మెప్పుడును నెఱ వేఱనే లేదు.

మాశాస్త్రపాఠశాలలోనివిద్యార్థులు ఇన్నీసు పేటలో నొకబాలికాపాఠశాలను సహితము స్థాపింప నుద్దేశించిరి. అట్లుద్దేశించినవారిలో పెద్దిభట్ల వేంకటప్పయ్యగారు మొదలయినవారు ముఖ్యులు. విద్యార్థులు పగలు బాలికా పాఠశాలలో పని చేయుటకు వలనుపడనందునను, ధనవ్యయము చేయుటకు శక్తులు కానందునను, వారిపక్షమున నేనాపనికిఁ బూని మిత్రులచేత చందాలు వేయించి యిన్నీసుపేటలో 1881 వ సంవత్సరమున నొకబాలికాపాఠశాలను స్థాపించితిని. మాశాస్త్రపాఠశాలాధ్యక్షులయిన మెట్కాపుదొరగారు వ్రాయుటచేతఁ గొంతకాలము శ్రీ పిఠాపురపురాజుగా రాబాలికాపాఠశాల నుంచుటకయి తమసత్రము నిచ్చిరి. నేను దానికిఁ గార్యనిర్వాహకుఁడనయి యుండి నేను నగరపారిశుధ్యవిచారణసంఘములో సభ్యుఁడ నగుటచేత మొదటిసంవత్సరము నెలకు పదేసిరూపాయలచొప్పునను, రెండవ సంవత్సరము పదునై దేసి రూపాయలచొప్పునను, మూడవసంవత్సరము మిరువదేసిరూపాయలచొప్పునను, సహాయద్రవ్యము నిప్పించుచు వచ్చితిని. దొరతనమువారును