పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

153



వేఱుగ దానికి సహాయధనము నిచ్చుచుండిరి. దానికి విఘాతము కలిగించుట కయి యోర్వలేనివారు కొందఱు ప్రయత్నము చేసినను వారికృషి సఫలము గాక తరువాత నది దొరతనమువారిచేఁ గైకొనఁబడి స్థిరపడి బాలికా విద్యాభ్యాసమున కత్యంతోపయుక్తమై యున్నది.

కులాచారవిషయములలోను రాజకీయవ్యహారములలోను గల యనేక దురాచారములను వినోదకరముగా సంభాషణరూపమున వెల్ల డిచేసి తన్మూలమున దురాచారములను మాన్పుటకయి వివేకవర్ధని కంతర్భాగముగా హాస్య సంజీవని ప్రకటింపఁబడుచుండెను. ఇందుఁ బ్రకటింపఁబడినవానిలో నొకటియగు వ్యవహారధర్మబోధినిని నామిత్రులు కొందఱును విద్యార్థులు కొందఱును జేరి 1880 వ సంవత్సరమున శ్రీవిజయనగరము మహారాజుగారి బాలికా పాఠశాలలో మొదటఁ బ్రయోగించిరి. అందు న్యాయాధికారుల యొక్కయు న్యాయవాదులయొక్కయు దుశ్చర్యలు పరిహాసరూపమునఁ బ్రకటింపఁబడినవి. వానిని బ్రదర్శించుటవలన నం దభివర్ణింపఁబడిన దోషములు గలవారిమనస్సులకుఁ గొంత నొప్పి గలిగినను, ఇటువంటిరూపకములను బ్రదర్శించుట కదియే మొదలయినందున నూఱులకొలఁదిజనులు వచ్చి చూచి యానందించిరి. ఇట్టినాటకప్రదర్శనమువలన జనులకు వినోదము కలుగుటయేకాక యక్రమములు చేయువారు సిగ్గుపడి తమప్రవర్తనమును దిద్దుకొనుటయు నందువలన నీతివర్ధిల్లుటయుఁ గలుగునుగానఁ గ్రొత్తనాటకములను జేసి నాటకసమాజము నొకదానిని స్థాపింపవలసినదని నామిత్రు లనేకులు నన్నుఁ గోరిరి. వారికోరిక ననుసరించి 1881 వ సంవత్సరములో కడపటి భాగమున నొక నాటకసమాజమును స్థాపించి, ధార్వాడనాటకులు వచ్చి నాటకములాడి విడిచిపోయిన పాకలోనే "చమత్కారరత్నావళి" "రత్నా వళి" యను రెండునాటకములు చేసి యాడించితిని. అట్టినాటకము లాడుట కదియే ప్రథమప్రయత్న మైనను, మొత్తముమీఁద నవి జయప్రదముగానే జరగినవని యెల్లవారు నభిప్రాయపడిరి. ఈనాటకప్రయోగమువలన సహితము పట్టణములో సంక్షోభము కలు