పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

131

గోదావరియొడ్డున నిసుకలో పాతిపెట్టింపఁ దలఁచిరి, కాని యట్లు పాతిపెట్టఁ బడిన శిశువులను కుక్కలును నక్కలును పెల్లగించి పయికీడ్చి తినుచుండఁగా సాధారణముగా చూచుచుండుటచేతను, శవవహనాదుల విషయమయిన యాచారమును మార్చుట యుచితమని యావఱకే తలఁచి యుండుటచేతను, ఆశిశువువిషయముననే క్రొత్తమార్పును జేయవలెనని నిశ్చయించుకొని శిశువు పట్టఁదగిన కొయ్యపెట్టెను చేయించి శిశుకళేబరము నందుంచి మూఁతకు మేకులు బిగించి దానిని తీసికొనిపోవు నిమిత్తమయి బండికొఱకు పాఠశాలలో సహోపాధ్యాయుఁడుగా నున్న యొక మిత్రునకు చీటివ్రాయఁగా నతఁడు తనబండి నిచ్చుటకు వలనుపడదని రాత్రి చీఁకటి పడినతరువాత ప్రత్యుత్తరము పంపెను. అప్పు డద్దెబండి నొకదానిని కుదుర్చుకొని, రాత్రివేళ గవర్రాజుగారును నేనును మఱియిద్దఱుమిత్రులును గలిసి యాపెట్టెను బండిలో పెట్టుకొని పోయి వారితోటలోనే యొకచోటఁ బూడ్చివచ్చితిమి. ఆపనిని చేసినందున కాయన నప్పుడు బంధువు లెందఱో యెన్ని విధములనో దూషించిరి; మిత్రులనఁబడువారు సహితము కొందఱు పరిహసించిరి; బంధుకోటిలోఁ జేరిన యొకతగుమనుష్యుఁడు స్మశానవాటికగా నేర్పఱిచినస్థలమును దప్పించి మఱియొకచోట శవమును పూడ్చినందుకయి పారిశుద్ధ్యశాసనము ననుసరించి మనపురపారిశుద్ధ్య విచారణసంఘము వారియుద్యోగస్థులచేత దండవిధాయకుని యొద్ద నభియోగమును తెప్పించుటకు సహితము పాటుపడెను. తాము కన్న శిశువును కాకులును గ్రద్దలును నక్కలును కుక్కలును పీకుచుండఁగా చూడ లేక వానికి స్వాధీనము కాకుండునట్లు పాతి పెట్టించుకొన్నప్పుడు లోకులింతద్వేషమును వహించుటకు వారి దేమి పడిపోయినదో విచారింపుడు."

ఈ ప్రకారముగా చిన్న చిన్న మార్పులను జేయఁ బ్రయత్నించుచుఁ గ్రమక్రమముగా వితంతువివాహము మొదలైన గొప్పసంస్కారములకుఁ బూనవలె ననియే నే నుద్దేశించియుంటిని గాని యింతలో నొకమిత్రుని ప్రోత్సాహమువలన ముందుగానే యత్యంతదుఃఖనివారకము నవశ్యాచరణీయమునైన