పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

స్వీయ చరిత్రము.

వితంతువివాహ సంస్కారభారమును పైని వేసికొనవలసినవాఁడనైతిని. 1874 వ సంవత్సరమునందు చెన్న పురిలోని ప్రముఖులు స్త్రీ పునర్వివాహమును బ్రోత్సాహపఱుచుటకయి సమాజ మొకటి స్థాపించి పనిచేయ నారంభించి యన్ని మండలములకును బ్రకటనపత్రికలను బంపిరి. ఆసమాజమునకు శ్రీపళ్లె చెంచ--రావు పంతులుగారు కార్యదర్శి. నే నప్పుడు నలువదినాలుగు రూపాయల జీతముగల యుపాధ్యాయుఁడనయి యనామకుఁడనై యుండుటచేత వారి ప్రకటనపత్రికలు నావఱకును జేరలేదు. ఆసమాజము రెండుసంవత్సరములకాలము కోలాహలముచేసి విశ్రమించినతరువాత మరల దానిపేరే వినఁబడలేదు. అది సందడి చేయుచుండిన కాలములో విశాఖపట్టణములోని ప్రముఖులప్రార్థన ననుసరించి శ్రీమహామహోపాధ్యాయ పరవస్తు వేంకటరంగాచార్యుల వారు పునర్వివాహసంగ్రహ మను పేరితో స్త్రీపునర్వివాహము శాస్త్రసమ్మతమని 1875 వ సంవత్సరమునం దొక చిన్న పుస్తకమును వ్రాసి ప్రకటించిరి. ఆపుస్తకము ప్రకటింపఁబడినప్పుడు బ్రహ్మశ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులవారు నా పేర నిట్లు వ్రాసిరి. -

"విశాఖపట్టణములో నుండెడు శ్రీపరవస్తు వేంకటారంగాచార్యు లయ్యవారులుంగారు నవనాగరికాధీనులై వితంతువివాహము కర్తవ్యమని యొక చిన్న పొత్తముం బ్రకటించిరిగదా. తద్విషయమున మనము మిన్నకుండవచ్చునా ? తమకుఁ దోఁచినట్లు ఖండన వ్రాసిపంపుఁడీ. నేను నిందస్మత్సభాసదులతోఁ దత్ఖండనపరాయణుండనై యున్నాఁడను. నాస్తికతాహర్మ్యసోపాన నివిష్టపరు లైనవారు దుష్టులుగాక శిష్టు లగుదురా. మనవారి స్వాచారానాదరమును దురాచారనిషేధకరణోపేక్షయు నిట్టిదశకుఁదెచ్చె. మనము నిట్టియెడ మౌన మూనుట మానుగాదు. నవనాగరికుల కున్న స్వాతంత్ర్యము మనకును గలదు. జంక నేల ? తోఁచినధర్మము నిక్కముగా వక్కాణించుట కెల్లరును స్వతంత్రులు కాఁబట్టి తాము దురాచారమర్దనమునకు నడుగిడుఁడు. దైవము మనకుఁ దోడ్పడుఁగాక. మనము కించిజ్ఞులమని శంకింపంబని లేదు. సర్వజ్ఞుఁడు