పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాతామహులైన అడివి వెంకటాచలంగారు చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. ఆయనకు పెదకళ్ళేపల్లి బదిలీ కావటం వల్ల వెంకయ్యగారి ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. బందరులో హైస్కూలు చదువు పూర్తి చేశారు.

చొరవ, సాహసం మూర్తీభవించిన వెంకయ్యగారు బొంబాయి వెళ్ళి, 19వ ఏట సైన్యంలో జేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ లు చూచివచ్చారు.

మద్రాసులో ప్లేగ్ ఇన్‌స్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్ళారిలో ప్లేగ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేశారు. ఆయన జ్ఞాన దాహం అంతులేనిది. శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్ ప్రత్యేక విషయంగా చదివి కేంబ్రిడ్జి సీనియర్ పరీక్షలో నెగ్గారు. కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్యగారిని ' జపాన్ వెంకయ్య ' అనేవారు.

వ్యవసాయ శాస్త్ర పరిశోధన

రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యగారికి వ్యవసాయంపట్ల ఎంతో అభిరుచి వుండేది. ఆయన కాంగ్రెస్ సభలకు తరచుగా వెళ్ళేవారు. 1908లో దాదాభాయి నౌరోజి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సభలకు వెళ్ళారు.

ఆ సభల్లోనే ముక్త్యాల రాజా నాయని రంగారావు బహద్దూర్ గారి పరిచయం కల్గింది. వ్యవసాయ రంగంలో అప్పటికే పరిశోధనలు సాగించిన వెంకయ్యగారితో పరిశోధనశాల నెలకొల్పారు. అమెరికా నుండి కంబోడియా ప్రత్తి విత్తనాలు తెప్పించి ప్రత్తిని పండించిన ఘనత వెంకయ్యగారికే చెల్లు. 1907 నుండి 1910 వరకు మునగాలలో ఉంటూ 'వ్యవసాయ శాస్త్రం' అనే గ్రంథాన్ని వ్రాశారు. అప్పుడాయనను 'ప్రత్తి వెంకయ్య' అనేవారు. వెంకయ్యగారికి, బ్రిటన్ లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ సభ్యత్వం లభించింది.

వెంకయ్యగారు బందరులోని జాతీయ కళాశాలలో 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా పని చేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. ఈనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'ఎన్.సి.సి.' శిక్షణోద్యమానికి 75 ఏళ్ళ క్రితమే శ్రీకారం చుట్టిన మహనీయుడు పింగళి వెంకయ్యగారు. అప్పట్లోనే చైనా జాతీయ నాయకుడైన ' సన్‌యెట్ సేన్ ' జీవిత చరిత్ర వ్రాశారు.

త్రివర్ణ పతాకం

1921లో విజయవాడలో (బెజవాడ) అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. గాంధీజీ కోరిక మేరకు వెంకయ్యగారు జాతీయ పతాకాన్ని తయారు