పింగళి వెంకయ్య
" ఈ పతాకం సామాన్యమైనది కాదు. సామ్రాజ్యవాద సూచకం కాదు. ఏ దేశాన్నీ ఆక్రమించే విధానాన్ని సూచించే కేతనం అసలే కాదు. ఇది మన స్వాతంత్ర్య చిహ్నం. " భారత రాజ్యాంగ సభలో జాతీయ పతాకాన్ని ప్రవేశపెడుతూ జవహర్‌లాల్ నెహ్రూ అన్న మాటలివి.
ఒక జాతి స్వాతంత్ర్యం, సౌభాగ్యం, సంపద పతాకంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. మన దేశంలో మొదటిసారిగ జాతీయ పతాకం కలకత్తాలోని గ్రీన్‌పార్కులో 1906 ఆగస్టు 7వ తేదీన ఎగురవేశారు.
1907లోనే ప్యారిస్ నగరంలో మేడం కామా జాతీయ పతాకం రూపొందించి ఎగురవేశారు. 1917లో హోమ్‌రూల్ ఉద్యమంలో ఈ పతాకమే రెపరెపలాడింది.
1907లోనే ఒక మేధావి జాతీయ పతాకాన్ని రూపొందించుటకు యత్నించాడు. 1916లో ' భారత దేశానికి ఒక జాతీయ పతాకం ' అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు. ఆ నిష్కళంక దేశభక్తుడే పింగళి వెంకయ్యగారు. ఆయన రూపొందించిందే నేటి మన జాతీయ పతాకం.
శ్రీ వెంకయ్య, కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో 1878 ఆగష్టు 2వ తేదీన జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు గారు దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణం.