పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేరాడు. 1934లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంస్థ అవతరించింది. 1948 లో రామన్ తమ స్వంత సంస్థ రామన్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ను ప్రారంభించాడు. ఆ సంస్థలో అధ్యయనం చేసిన, రామన్ శిష్యులలో అగ్రగణ్యులు డా. హోమి జె.భాభా, డా.సూరిభగవంతం, డా. విక్రమ్ సారాభాయ్, డా.కె.యస్.కృష్ణన్, డా. రామశేషన్ మున్నగువారు.

స్వతంత్ర భారతావరణంలో శాస్త్రీయ పరిశోధనా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

రామన్ కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం అతనిని 'సర్' బిరుదంతో సత్కరించింది. ప్రపంచమందలి ప్రముఖ విశ్వవిద్యాలయాలెన్నో అతనిని గౌరవ డాక్టరేట్ బిరుదములతో సత్కరించాయి. 1954లో భారత ప్రభుత్వం అతనిని 'భారత రత్న' ప్రశస్తితో గౌరవించింది. కొన్ని వందల ఘన సన్మాలందుకొన్న మహామనీషి సర్ - సి.వి. రామన్.

రామన్ సంగీత శాస్త్రములో చక్కని ప్రవేశం కలవాడు. మృదంగ వాద్యంపై, శబ్ద తరంగాలపై ప్రయోగాలు సాగించాడు. రామన్ పరిశోధనలు ఫోటోగ్రఫీ, రబ్బర్ ప్లాస్టిక్ పరిశ్రమల కెంతో తోడ్పడింది.

రామన్ విజ్ఞానశాస్త్ర ప్రగతికెంతో కృషి చేశాడు. రాజకీయవాదులు వైజ్ఞానిక రంగంలో ప్రవేశించకూడదని ఆయన అభిప్రాయం.

ప్రతి ఏటా, ప్రధాని నెహ్రూ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలను ప్రారంభించడం రామన్‌కు నచ్చలేదు. ఆయన శిష్యుడైన శ్రీ వి.టి.శ్రీనివాసన్, రామన్‌తో మాట్లాడుతూ ఆ విషయం ప్రస్తావించగా 'ప్రపంచంలో ఏ దేశంలో నైనా, రాజకీయ నాయకులు విజ్ఞాన శాస్త్ర సమావేశాలు ప్రారంభించారా? గత 17ఏళ్ళుగా, సంస్థ నిర్వాహకులు, మన ప్రధానితోనే ఎందుకు ప్రారంభిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఇప్పుడు ఆయన లేరు, ఆయన కూతురితో, ఈ పని చేయిస్తున్నారు. ఇదే మాత్రం సముచితం కాదు.' అందుకే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవతరించింది.

రామన్ హాస్య చతురుడు. కొన్ని దశాబ్దాల క్రితం బెంగుళూరులోని ఒక బ్యాంకర్ (ధర్మరత్నాకర గోపాలరావు) గారి వద్ద రామన్ 75వేల రూపాయలు వుంచాడు. కొద్ది కాలం తర్వాత ఆ బ్యాంకర్ దివాలా అయినట్లు తెలిసింది. 'నోబెల్ బహుమతి గ్రహీతకే టోపీ పెట్టిన, ఆ బ్యాంకర్‌కు నోబెల్ పారితోషికం ఇవ్వడం సబబు' అన్నాడు డా.సి.వి.రామన్.

"కార్యసాధకులకు హంగులు ఆర్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు నేను సాగించిన ప్రయోగానికి నా పెట్టుబడి కేవలం రెండువందల రూపాయలే!" అన్నారాయన. జాతీయ పరిశోధనాలయాలపై అనవసరంగా విపరీతమైన ధనాన్ని వ్యయపరచడం రామన్ గారికి సరిపడేది కాదు. అందువల్లనే "షాజహాన్ తన ప్రియురాలి శవాన్ని ఖననం చేసేందుకు తాజ్ మహల్ నిర్మించాడు. జాతీయ ప్రయోగశాలలు శాస్త్ర పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసేందుకు నిర్మించారు" అన్నారాయన.