పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. క్రమంగా గ్రామవ్యవస్థలో మార్పులు తటస్థించి పంచాయితీ సభలు ఏర్పడ్డాయి. ఏడాదికో గ్రామ పెద్దను ఎన్నుకోవటం ప్రారంభమైంది.

6. అరణ్యాలను కొట్టి భూములను సేద్యానికివ్వడం, సమిష్టి సేద్యం మొదలైనవి ఆనాటి వ్యవసాయ పద్ధతులు. భూముల కొలతలు, బార, మూర, గద, కుంట అని ఉండేవి.

7. విజయనగర కాలం నాటికి ఇస్లాం ఇక్కడ వేళ్ళూనింది. హిందువుల బౌద్ధుల పతనం అత్యంత లజ్జాకరమైంది. యుద్ధతంత్రంలో ముస్లింలు హిందువుల కన్నా నిస్సందేహంగా నిపుణులు. రెడ్డి, వెలమ, విజయనగర రాజులు ప్రతిఘటించినంత కాలం తెలుగు ప్రాంతం ముస్లింలకు లొంగ లేదు. విజయనగర పతనంతో ఆంధ్రుల పతనం పుార్తి అయింది. తురక, క్రైస్తవాల ప్రాబల్యం నుండి ఆంధ్ర దేశాన్ని రక్షించింది రాజులు కారని ఆనాటి తత్వవేత్తలని ప్రతాపరెడ్దిగారు అభిప్రాయపడ్డారు. వారిలో ముఖ్యులు వేమన, వీర బ్రహ్మం.

8. శ్రీనాథుడు వర్ణించిన కన్నడ దేశాన్ని ఆనాటి కర్ణాటక భాగమైన రాయలసీమగా భావించారు రెడ్డిగారు. పన్నులు వసూలు చేయుటలో శ్రీనాథ కవిని హింసించిన పద్ధతులు హైదరాబాద్ రాజ్యంలో 1900 వరకు ఉండేవన్నారు సురవరం వారు.

తెలంగాణా రాజకీయ చరిత్రలో ప్రతాపరెడ్డిగారు ప్రముఖ పాత్ర వహించారు. 1927లో ఏర్పడిన ఏకైక ప్రజాసంస్థ అయిన ఆంధ్ర మహాసభ యొక్క ప్రథమ మహాసభకు అధ్యక్షత వహించారు. వారి సేవలు అందుకొనని సంస్థ తెలంగాణాలో ఏ ఒక్కటి లేదు.

ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన ఆంధ్ర భాషా నిలయం, హిందీ ప్రచారసభ మున్నగు సంస్థల ప్రగతికి ఎంతో కృషి చేశారు.

రెడ్డిగారి మిత్రులైన గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు కర్నూలు నుండి శాసనసభకు పోటీచేయమని కోరగా రెడ్డిగారు తిరస్కరించారు. కాని పోలీస్ చర్య అనంతరం 1952 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో, మిత్రుల ఒత్తిడిపై వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. కాని రాజకీయాలు వారి కంతగా రుచించలేదు.

సురవరం వారు రచించిన ' ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ' కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ' లభించింది.

త్యాగము, దేశభక్తి, భాషాభిమానం ప్రజా శ్రేయస్సు పరమార్ధంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డిగారు 1953 ఆగష్టు 25న దివంగతులయ్యారు.